One Nation-One Election | ఇటీవల కాలంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తుండగా పలు పార్టీలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. దేశవ్యాప్తంగా 81 మంది ప్రజలు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచనకు జైకొట్టారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌పై ఏర్పాటు చేసిన కమిటీకి ప్రజల నుంచి 20,972 సూచనలు అందాయి. ఈ సూచనల్లో 81శాతం మంది మద్దతు తెలిపారు. న్యూఢిల్లీలో కమిటీ మూడో సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీ 46 రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు కోరింది. ఇప్పటి వరకు 17 పార్టీలు స్పందించాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించాయి. కమిటీ జనవరి 5న సామాన్య ప్రజల నుంచి సూచనలు కోరింది. గులాం నబీ ఆజాద్, న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ సీ కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ సమావేశంలో పాల్గొన్నారు.