Site icon vidhaatha

Online betting: మాట వినాలి..మంచి మాట వినాలి: సజ్జనార్

Online betting:  ఆన్ లైన్ బెట్టింగ్..అధిక లాభాల ఆశల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్ధంటూ టీజీఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ వీ.సీ.సజ్జనార్ మరోసారి ఎక్స్ వేదికగా హెచ్చరించారు. యువకుల్లారా!! ఈజీ మనీకి అలవాటుపడి బెట్టింగ్ కూపంలోకి వెళ్ళకండని..తమ బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండని హితవు పలికారు.

తాజాగా ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి బలైన డీగ్రీ విద్యార్థి కథనాన్ని సజ్జనార్ పోస్టు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్ రావు(22) హైదరాబాద్ లోని ఓ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. నిఖిల్ కొంత కాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లతో అప్పుల పాలు కాగా తండ్రి తిరుపతిరావు వాటిని తీర్చాడు. ఈ నెల 7న స్వగ్రామానికి వచ్చిన నిఖిల్ తిరిగి హైదరాబాద్ కు వెళ్లే క్రమంలో తండ్రి తిరుపతిరావు స్వయంగా కరీంనగర్ బస్టాండ్లో దించి వెళ్లాడు.

నిఖిల్ హైదరాబాద్ వెళ్లకుండా మళ్లీ స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యలో ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక రైతుల సమాచారంతో మృతదేహాన్ని వెలికి తీసి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ ఏకైక సంతానమైన నిఖిల్ ఇలా ఆన్ లైన్ బెట్టింగ్ బాధలతో ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగారు.

ఈ సంఘటనను ప్రస్తావించిన సజ్జనార్ చేతికి అందిన బిడ్డ బీఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి వ్యవసాయ అధికారిగా స్థిరపడతాడునుకున్న తల్లిదండ్రుల ఆశలను ఆన్ లైన్ బెట్టింగ్ భూతం అడియాశలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరెవరు ఇలాంటి ఇబ్బందుల్లో పడిపోకుండా ఆన్ లైన్ బెట్టింగ్ లకు, సైబర్ మోసాలకు యువత దూరంగా ఉండాలని సజ్జనార్ కోరారు.

Exit mobile version