ED సోదాలతో విపక్ష నేతలు ఒక్కటవుతున్నారు: లోక్‌సభలో ప్రధాని మోదీ

విధాత: ఈడీ సోదాలతో విపక్ష నేతలు ఒక్కటవుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రపతి తన ప్రసంగంతో స్ఫూర్తి నింపారన్నారు. రాష్ట్రపతి ముర్ము ద్వారా ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందని, కొందరు నేతలు రాష్ట్రపతిని అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశాధినేతగా రాష్ట్రపతి ముర్ము భారత మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, కొందరు నేతలు రాష్ట్రపతిని సైతం అవమానించేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఓ వైపు ప్రధాని మాట్లాడుతుండగానే.. […]

  • Publish Date - February 8, 2023 / 12:18 PM IST

విధాత: ఈడీ సోదాలతో విపక్ష నేతలు ఒక్కటవుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. రాష్ట్రపతి తన ప్రసంగంతో స్ఫూర్తి నింపారన్నారు. రాష్ట్రపతి ముర్ము ద్వారా ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందని, కొందరు నేతలు రాష్ట్రపతిని అవమానించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశాధినేతగా రాష్ట్రపతి ముర్ము భారత మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, కొందరు నేతలు రాష్ట్రపతిని సైతం అవమానించేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

ఓ వైపు ప్రధాని మాట్లాడుతుండగానే.. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని విపక్షాల సభ్యులు నినాదాలు చేశారు. దీనితో ప్రధాని ప్రసంగానికి కొద్దిసేపు ఆటంకం కలిగింది. ఆ తర్వాత ప్రధాని మాట్లాడుతూ భారతదేశ ప్రగతిని చూసి కొన్ని శక్తులు ఓర్వలేక పోతున్నాయని ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు. భారత్‌ సాధించిన విజయాలను అంగీకరించ లేకపోతున్న శక్తులన్నీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

దేశంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని చెప్పారు. కరోనా సమయంలో ఉచితంగా వ్యాక్సిన్లు అందించామన్నారు. కరోనా వేళ టీకాలు అందించినందుకు అనేక దేశాలు భారత్‌ను ప్రశంసించాయని, కరోనా టీకాల పంపిణీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్‌ గౌరవం పెరిగిందని చెప్పారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంపై ప్రపంచం ఆసక్తిగా చర్చించుకుంటోందన్న ఆయన.. కొందరు దేశ ప్రగతిని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.

స్టార్టప్‌ల విషయంలో ప్రపంచంలో భారత్‌ మూడోస్థానంలో ఉందని, దేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. 108 స్టార్టప్‌లు యూనికార్న్‌ స్థాయిని అందుకున్నాయని, దేశంలో ఇంజినీరింగ్‌, వైద్య కళాశాల సంఖ్య వేగంగా పెరుగుతోందన్నారు. భారత క్రీడాకారులు విశ్వ యవనికపై అనేక విజయాలు సాధిస్తున్నారని, భారత్‌ సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు.

యూపీఏ పాలనలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు తీవ్రవాదులు చెలరేగిపోయారని, యూపీఏ హయాంలో కామన్వెల్త్‌ ఆటల కుంభకోణంతో దేశం పరువుపోయిందని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. భారత్‌ ప్రజాస్వామ్య మాతృమూర్తి అని, ప్రజాస్వామ్య బలోపేతం కోసం చిత్తశుద్ధితో కృషి జరగాలన్నారు. విపక్ష నేతలు తొమ్మిదేళ్లుగా ఆలోచించడం లేదని, ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

విపక్ష నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, ఆర్‌బీఐ, ఈసీ, సైన్యంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్మాణాత్మక విమర్శలు తాము స్వాగతిస్తామన్నారు. దేశం కోసం కాకుండా.. ఈడీతో విపక్షనేతలు ఒక్కటవుతున్నారని విమర్శించారు. విపక్షాలను ఈడీ ఏకం చేస్తోందన్నారు.

కాంగ్రెస్‌ ఉత్థాన పతనాలపై హార్వర్డ్‌ యూనివర్సిటీలోనూ పరిశోధన జరిగిందన్నారు. దేశ ప్రజలు మోదీపై విశ్వాసం ఉంచారని, టీవీ ప్రచారాల కారణంగా మోదీపై భరోసా రాలేదన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్‌ కోసమే మోదీపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందన్నారు. ప్రతిపక్షాల మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.

Latest News