Site icon vidhaatha

Saudi Arabia | పిల్ల‌లు.. స్కూల్‌కు ఆబ్సెంట్ అయితే త‌ల్లిదండ్రుల‌కు జైలు

Saudi Arabia |

విధాత‌: క‌ఠిన చ‌ట్టాల సాయంతో ప‌రిపాలించే దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) విద్యార్థుల హాజ‌రు కోసం ఆ దేశం తీసుకొచ్చిన ఒక తాజా చ‌ట్టం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఎవ‌రైనా విద్యార్థి స‌మాచారం ఇవ్వ‌కుండా 20 రోజులు స్కూల్‌కు వెళ్ల‌క‌పోతే ఆ విద్యార్థి త‌ల్లిదండ్రుల‌కు జైలు శిక్ష విధించాల‌ని సౌదీ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకున్న‌ట్లు ఆ దేశ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది.

బాల‌ల సంర‌క్ష‌ణ చ‌ట్టానికి అనుగుణంగా పిల్ల‌ల్లో విద్యా ప్ర‌మాణాల పెంపున‌కు ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు అధికారులు తెలిపిన‌ట్లు పేర్కొంది. వారు తెలిపిన దాని ప్ర‌కారం.. 20 రోజుల పాటు విద్యార్థి పాఠ‌శాల‌కు రాక‌పోతే గార్డియ‌న్గా ఉన్న వ్య‌క్తిని అరెస్టు చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెడతారు. అత‌డు లేదా ఆమె నిర్ల‌క్ష్యం వ‌ల్లే విద్యార్థి ఆబ్సెంట్ అయిన‌ట్లు భావిస్తే జ‌డ్జి నిర్ణ‌యాధికారాన్ని బ‌ట్టి అత‌డికి జైలు శిక్ష వ్య‌వ‌ధిని నిర్ణ‌యిస్తారు.

అయితే ఈ చ‌ట్టం దుర్వినియోగం కాకుండా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ముందుగా విద్యార్థి ఆబ్సెంట్ గురించి నివేదిక త‌యారుచేసి స్కూల్ ప్రిన్స్‌పాల్.. పై విభాగానికి పంపుతారు. వారు విచార‌ణ చేసి ఆ నివేద‌క‌ను నేరుగా విద్యాశాఖ‌కు పంపుతారు. ఆ త‌ర్వాత కుటుంబ వ్య‌వ‌హారాల శాఖ విద్యార్థిని గార్డియ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా ఇంట‌ర్వ్యూ చేసి కార‌ణాల్ని విశ్లేషిస్తారు.

ఇక్క‌డ వ‌చ్చిన నివేదిక ఆధారంగా జైలు శిక్ష ఉంటుందా ఉండ‌దా అని నిర్ణ‌యించి.. నిర్ణ‌యాధికారాన్ని కోర్టుకు విడిచిపెడ‌తారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ వేస‌వి సెల‌వులు పూర్తి కావ‌డంతో.. ఎవ‌రూ ఆబ్సెంట్ కాకుండా ఉండేందుకు ఈ చ‌ట్టాన్ని తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారా అనే అనుమానాలూ ఉన్నాయి. ఈ క‌థ‌నాల‌పై సౌదీ ప్ర‌భుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Exit mobile version