Gram Panchayats: గ్రామపంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజున రూ.153కోట్ల పెండింగ్ బిల్లుల విడుదల చేసింది. 2024ఆగస్టు వరకు పెండింగ్ లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున క్లియర్ చేసింది. పంచాయతీల్లో కొన్నేళ్లుగా గత ప్రభుత్వం బిల్లుల చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. అలాగే నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఒకే రోజున రూ.153కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించింది. ప్రభుత్వం రానున్న జూలైలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతుందన్న తరుణంలో పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతో అధికార పార్టీ పంచాయతీ ఎన్నికలకు నగరా మోగించబోతుందన్న సంకేతాలు ఇచ్చినట్లయ్యిందంటున్నారు విశ్లేషకులు.
మరోవైపు పంచాయతీలకు పెండింగ్ నిధులతో పాటు రూ.85కోట్ల ఎస్డీఎఫ్ నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థలు వంటి పనులకు ఈ నిధులు ఉపయోగ పడనున్నాయి. గత ప్రభుత్వం ఎస్డీఎఫ్ నిధులు కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పనులు ఆర్థాంతరంగా ఆగిపోయి ఇబ్బంది పడ్డారు.