Por Thozhil Review | పోర్ తొళిల్ సినిమా రివ్యూ.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌.. అస్సలు మిస్సవ్వవద్దు

Por Thozhil Review | మూవీ పేరు: పోర్ తొళిల్ OTT ఫ్లాట్‌ఫామ్: సోనీ లివ్ నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, శరత్ బాబు, నిఖిలా విమల్, నిళల్ రవి తదితరులు సినిమాటోగ్రఫీ: కాలై సెల్వన్ శివాజీ సంగీతం: జేక్స్ బిజోయ్ ఎడిటింగ్: శ్రీజిత్ సరంగ్ రచన: విఘ్నేష్ రాజా, ఆల్ప్రైడ్ ప్రకాశ్ నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెగల్, ముఖేశ్ ఆర్. మెహతా, సీవీ భరత్, పూనమ్ మెహ్రా, సందీప్ దర్శకత్వం: విఘ్నేష్ రాజా […]

  • Publish Date - August 14, 2023 / 01:56 AM IST

Por Thozhil Review |

మూవీ పేరు: పోర్ తొళిల్
OTT ఫ్లాట్‌ఫామ్: సోనీ లివ్
నటీనటులు: శరత్ కుమార్, అశోక్ సెల్వన్, శరత్ బాబు, నిఖిలా విమల్, నిళల్ రవి తదితరులు
సినిమాటోగ్రఫీ: కాలై సెల్వన్ శివాజీ
సంగీతం: జేక్స్ బిజోయ్
ఎడిటింగ్: శ్రీజిత్ సరంగ్
రచన: విఘ్నేష్ రాజా, ఆల్ప్రైడ్ ప్రకాశ్
నిర్మాతలు: సమీర్ నాయర్, దీపక్ సెగల్, ముఖేశ్ ఆర్. మెహతా, సీవీ భరత్, పూనమ్ మెహ్రా, సందీప్
దర్శకత్వం: విఘ్నేష్ రాజా

ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు మంచి సినిమా అంటే చాలు చూసేస్తున్నారు. కొత్తగా, వైవిధ్యంగా ఉందనే టాక్ వినిపిస్తే చాలు.. ఎగబడి మరీ చూస్తున్నారు. అందుకే ఓటీటీ మాధ్యమం ఇప్పుడొక అడ్డాగా మారిపోయింది. థియేటర్లలో సినిమా మనుగడ రోజురోజుకీ తగ్గిపోతున్నప్పటికీ.. ఓటీటీలో మాత్రం అదే సినిమా కంటెంట్ బాగుంటే మాత్రం బీభత్సంగా వ్యూవర్స్‌ని రాబట్టుకుంటోంది.

అందుకే థియేటర్లలో సినిమాలు రెండు వారాలకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడన్ని ఇండస్ట్రీలలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఆ థియేటర్‌కి వెళ్లి ఏం చూస్తాంలే.. రెండు వారాలు పోతే ఓటీటీలో వచ్చేస్తుంది.. చక్కగా ఫ్యామిలీ అంతా చూడవచ్చనే ట్రెండ్‌ని ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు. అందుకే థియేటర్స్‌తో పని లేకుండా సినిమాలు హిట్టవుతున్నాయి. డిజిటల్‌గా మంచి రేటును పలుకుతున్నాయి.

ఇక ఓటీటీలలో మరీ ముఖ్యంగా ఆదరణ పొందుతున్న సినిమాలేంటయ్యా అంటే.. ఖచ్చితంగా క్రైమ్ థ్రిల్లర్సే అని చెప్పాలి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. కానీ.. సరైన కంటెంట్ పడి, ఆసక్తికరంగా కథని చెప్పగలిగితే మాత్రం.. ఈ జానర్ సినిమాలతో ఓటీటీ సర్వర్లు బద్దలవడం ఖాయం.

ఇప్పుడలాంటి ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా రివ్యూనే ఇది. తమిళ్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 9న థియేటర్లలో విడుదలై మంచి రిజల్ట్‌ని, కలెక్షన్స్‌ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగులో డబ్ చేసి.. సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి దింపారు. ఈ సినిమా తమిళ్‌లో అంత విజయం సాధించడానికి కారణం ఏమిటి? ఈ సక్సెస్ వెనుక ఉన్న మిస్టరీ ఏమిటనేది మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కథగా చెప్పడానికి తెలుగు ప్రేక్షకులకు తెలియని కథ అయితే కాదు. రీసెంట్‌గా వచ్చిన ‘హిడింబ’ సినిమా కూడా దాదాపు ఇలానే ఉంటుంది కానీ, అందులో నేపథ్యం వేరు. వరుసగా అమ్మాయిలు చంపబడుతుంటా రు. అదీ కూడా మంచి వయసు మీద ఉన్న అమ్మాయిలు. వాళ్లపై ఎటువంటి హత్యాచారం కానీ, వాళ్ల దగ్గర ఉన్న వస్తువులను దోచుకోవడం కానీ లేకుండా.. కేవలం తల వెనక్కి విరగదీసి.. నోట్లో నుంచి చేతులు, కాళ్లు కలిపి కట్టేసి.. కత్తితో పీక కోసేస్తుంటాడు హంతకుడు.

తిరుచ్చిలో మొదటిసారి ఇలాంటి కేసు నమోదు అవుతుంది. మొదటి కేసు నమోదైన మూడో రోజు మరో కేసు.. ఇలా మూడు రోజులకు ఒకసారి ఒక యువతిని హంతకుడు చంపేస్తుంటాడు. ఈ కేసును స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన ఎస్పీ లోకనాథన్ (శరత్ కుమార్)కు అడిషనల్ డీజీపీ అప్పగిస్తాడు. అతనితో పాటు అప్పుడే డీఎస్పీగా ట్రైన్ అవడానికి వచ్చిన ప్రకాశ్(అశోక్ సెల్వన్)ని కూడా లోకనాథన్‌తో పంపిస్తాడు. వీరితో పాటు వీరికి హెల్ప్ చేసేందుకు టెక్నికల్ అసిస్టెంట్‌గా వీణ (నిఖిలా విమల్) కూడా వెళుతుంది.

ఈ ముగ్గురు తిరుచ్చి వెళ్లి విచారణ జరుపుతుండగానే.. సేమ్ ప్యాట్రన్‌లో హత్యలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి కూతురు కూడా చనిపోతుంది. దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న లోకనాథన్, ప్రకాశ్.. అసలు హంతకుడిని ఎలా పట్టుకున్నారు? అసలు ఈ దారుణ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు ఇలా యువతులనే టార్గెట్ చేసి చంపుతున్నాడు? మధ్యలో కెన్నడీ (శరత్‌బాబు)కి, ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని సోనీలివ్ ఓటీటీలో చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇందులో ముఖ్యంగా కనిపించేవి ఓ ఐదారు పాత్రలే. అందులో ఎస్పీ లోకనాథన్‌గా శరత్ కుమార్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌ను కనబరిచాడు. ఆయన సీరియస్ నెస్, స్ట్రిక్ట్‌గా ఉండే విధానం, కేసును ఆయన చూసే కోణం అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. నిజంగా పోలీస్ అధికారులు ఇలా ఉంటేనా? అనేంతగా శరత్ కుమార్ ఆ పాత్రకి న్యాయం చేశాడు. అతని తర్వాత మెయిన్ పాత్రగా చెప్పాలంటే అశోక్ సెల్వన్ పాత్ర. అర్థరాత్రి పూట ఒంటేలుకు పోవడానికి కూడా భయపడే వ్యక్తి.. డీఎస్పీగా అందులోనూ ఓ నర హంతకుడిని పట్టుకోవడం అంటే.. ఆ పాత్రకి ఎటువంటి సన్నివేశాలను చేర్చవచ్చో.. దర్శకుడు అన్నీ చేర్చాడు.

అశోక్ సెల్వన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అమాయక నటనతో నవ్విస్తూనే.. కథలో సీరియస్‌నెస్‌ని తీసుకొస్తాడు. అశోక్ సెల్వన్‌కి చాలా మంచి పాత్ర అని చెప్పుకోవచ్చు. అలాగే అతను కూడా తన నటనతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాడు. వీణగా నిఖిలా విమల్ కనిపించే ప్రతి సీన్‌లో తన చూపులతో కట్టిపడేస్తుంది. అశోక్ సెల్వన్‌కి ధైర్యం చెప్పే సీన్‌లో, అతనిని ఆట పట్టించే తీరులో ఆమె నటన చాలా న్యాచురల్‌గా అనిపిస్తుంది. ఈ మూడు పాత్రలతో పాటు మరికొంత మంది పోలీసు అధికారులు మొదటి సగంలో కనిపిస్తారు.

సెకండాఫ్‌లో కెన్నడీగా శరత్ బాబు తన కెరీర్‌లోనే బెస్ట్ పాత్రలో నటించాడని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ హత్యలు అన్నీ అతనే చేసి ఉంటాడనేలా.. అతని నటన ఉంటుంది. అతను ప్రస్తుతం భూమి మీద లేడు కానీ.. ఆయన చేసిన ఈ పాత్రతో.. ఈ సినిమా చూసిన వారికి బాగా గుర్తొస్తాడు. అలాంటి పాత్రలో శరత్ బాబు చక్కగా మెప్పించాడు. సినిమాలో అతనిని చూస్తున్నంత సేపు మనకు భయం కలుగుతతూ ఉంటుంది. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా.. ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. మరీ ముఖ్యంగా దర్శకుడిని అభినందించాలి. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు రోజుకి ఒకటి ఎక్కడో ఒక చోట విడుదల అవుతూనే ఉంది. కానీ.. బిగి సడలనీయకుండా సినిమాని నడిపిన తీరుకు ముందుగా అతను అభినందనీయుడు. అలాగే కథలో భాగమైన ఆల్ప్రైడ్ ప్రకాశ్‌ని కూడా అభినందించాలి. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలా సాంకేతికంగా సినిమాకు కావాల్సినవన్నీ కరెక్ట్‌గా పడ్డాయి. కాకపోతే.. సెకండాఫ్ మొదలైన కాసేపు సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

కానీ కెన్నడీ రూపంలో వచ్చే ట్విస్ట్‌తో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడతారు. అప్పటి వరకు అతనే హంతకుడు అనుకుని.. సినిమా అయిపోతుంది కదా.. అనుకుంటున్న వారికి లాగి చెంపమీద కొట్టినట్టు దర్శకుడు మరో ట్విస్ట్‌తో నరాలు వేడెక్కేలా చేశాడు. ‘పెయింటింగ్‌ని బట్టి ఆర్టిస్ట్‌ని, హత్యని బట్టి కిల్లర్‌ని తెలుసుకోవచ్చు, ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయకుండా.. రిటైర్ అయిన పోలీసులు ఎందరో ఉన్నారు’ అనే డైలాగ్స్ బాగున్నాయి. ఆ డైలాగ్స్‌కు వివరణ ఇచ్చినట్లుగా కూడా సినిమాలో చూపించడం దర్శకుడి ప్రతిభకి నిదర్శనం. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాలంటే ట్విస్ట్‌లతో పాటు, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ తరహా చిత్రాలు విజయాలను సాధిస్తాయి. తెలుగులో ‘హిట్’ సిరీస్‌లతో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను శైలేష్ కొలను తీస్తున్నారు. అందులో హంతకుడు మొదటి నుంచి పక్కనే ఉంటాడు. కానీ చివరి వరకు తెలియదు. అసలు హత్యలు చేస్తుంది ఎవరనేది చివరి వరకు ప్రేక్షకులకు తెలియనీయకుండా.. ఆసక్తికరంగా కథ నడపగలిగితే ఈ జానర్‌తో ఈజీగా హిట్ కొట్టవచ్చు. కానీ ఒక్కసారి చూసిన తర్వాత ఇలాంటి సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఉండరు. అలా రిపీటెడ్‌ ఆడియెన్స్ ఉండాలంటే.. కథనం కొత్తగా ఉండాలి. అలాంటి కథనమే ఇందులో ఉంది.

దర్శకుడు అంతర్లీనంగా మంచి మెసేజ్‌ని కూడా ఇవ్వడం ఇందులో ఉన్న ఆసక్తికరమైన మరో విషయం. తల్లిదండ్రులకు ఈ సినిమా పాఠంలాగా అనిపిస్తుంది. పిల్లల విషయంలో ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత గొడవ పడే భార్యభర్తలలో కొంచమైనా మార్పు వస్తుంది. ఇది నిజం. ఇది దర్శకుడి ప్రతిభ అని చెప్పుకోవాలి. ఇంకా ఇందులో టచ్ చేసిన మరో పాయింట్ అక్రమ సంబంధం. అందులోనూ కొత్త పాయింట్‌ని జోడించాడు దర్శకుడు.

ఇవన్నీ ఒక పార్ట్ అయితే.. ఇన్విస్టిగేషన్ నడిచే తీరు చాలా ఆసక్తికరంగా సాగుతుంది. మధ్యమధ్యలో కాస్త సాగదీసినట్లుగా అనిపించినా.. ప్రకాశ్ పాత్రలోని అమాయకత్వంతో దానిని కవర్ చేశాడు. ప్రకాశ్, వీణల మధ్య ప్రేమ వ్యవహారాన్ని కూడా సాగదీయకుండా.. దానిని కూడా కేసుకు లింక్ చేసిన ట్విస్ట్‌తో చూస్తున్నవారంతా ఒక్కసారిగా అలెర్ట్ అవుతారు. ఆ ట్విస్ట్‌ని అస్సలు ఊహించరు.

ఇంకా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలని తమిళ దర్శకుడు హరి చేసిన సింగం సిరీస్ సినిమాల మాదిరిగా కాకుండా.. చూస్తున్న ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పాలి. సీన్ టు సీన్‌కి ప్రేక్షకుడు కనెక్ట్ కాగలిగితేనే, ఏం జరుగుతుందో అర్థమైతేనే.. ఇలాంటి థ్రిల్లర్స్ మెప్పిస్తాయి. ఇందులో ఆ పాయింట్‌ని కూడా దర్శకుడు చక్కగా ఫాలో అయ్యాడు. వరుస హత్యలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, అతనిని కాల్చి చంపేసి కేసు క్లోజ్ చేశామని ప్రకటించినా.. అసలు హంతకుడు బతికే ఉన్నాడని రివీల్ చేసిన విధానం బాగుంది.

ముఖ్యంగా కెన్నడీ పాత్రలో శరత్‌బాబుని రెండు కోణాల్లో దర్శకుడు ప్రజంట్ చేసిన విధానం అందరూ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. కెన్నడీ పాత్రకి జోడించిన గతం కూడా.. సినిమాపై ఇంట్రస్ట్‌ని కలగజేస్తుంది. ఇక అసలు నేరస్తుడు విషయంలో కొంచెం క్లారిటీ మిస్సయినట్లుగా అనిపించినా.. ఆ పాత్రని అంతకంటే ఎక్కువ చూపిస్తే సాగదీసినట్లు అవుతుందని దర్శకుడు భావించినట్లు ఉన్నాడు. లాస్ట్ అరగంటకి ముందు అసలు నేరస్తుడిని చూపించారు. ఆ తర్వాత వచ్చే సీన్స్.. ప్రేక్షకుడిని అసలు సీట్లో కూర్చోనీయవు.

మొత్తంగా అయితే ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్‌ని చూసిన ఫీలింగ్‌ని ఈ సినిమా ఇస్తుంది. అలాగే ఓ మంచి మెసేజ్ కూడా ఇందులో ఉంది. కాబట్టి.. డోంట్ మిస్ ఇట్. వెంటనే సోనీ లివ్‌‌లో ఉన్న ఈ థ్రిల్లింగ్ సినిమాని వీక్షించండి. చివరిలో దీనికి కొనసాగింపు ఉంటుందనేలా.. మరో కేసు కోసం ఇద్దరూ బయలు దేరిన విధానాన్ని కూడా చక్కగా లింక్ చేశాడు దర్శకుడు.

ట్యాగ్‌లైన్: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. అస్సలు మిస్సవ్వవద్దు
రేటింగ్: 3.5/5

Latest News