Site icon vidhaatha

బాపురే.. పట్టపగలే ఇంత భారీ మోసమా?

న్యూఢిల్లీ: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించేలా బ్యాలెట్‌ పేపర్లను ప్రిసైడింగ్‌ అధికారి తారుమారు చేశారని ఇండియా కూటమి ఆరోపించింది. బ్యాలెట్‌ పేపర్లను ప్రిసైడింగ్‌ అధికారి ట్యాపరింగ్‌ చేస్తున్న వీడియోను ఆప్‌ నేతలు బయటపెట్టారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో తగినంత సభ్యుల బలం ఉన్నప్పటికీ ఆప్‌-కాంగ్రెస్‌ కూటమి ఓడిపోయిన సంగతి తెలిసిందే. 8 ఓట్లు చెల్లకుండా పోవడంతో బీజేపీ అభ్యర్థి గెలిచారు. వాస్తవానికి జనవరి 18న మేయర్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా.. ప్రిసైడింగ్‌ అధికారి అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 6కు చండీగఢ్‌ అధికారులు వాయిదా వేశారు. అయితే.. పంజాబ్‌- హర్యానా హైకోర్టు ఆదేశాలతో మంగళవారం ఎన్నిక నిర్వహించారు. బ్యాలెట్‌ పత్రాల్లో ప్రిసైడింగ్‌ అధికారి మార్పులు చేస్తున్న వీడియోను విడుదల చేసిన పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరిందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌.. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హత్య చేసిందని ఆరోపించారు. ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలెట్‌ పత్రాలను మానిప్యులేట్‌ చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని అన్నారు. ‘బీజేపీ అవినీతికర పార్టీయే కాదు.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. కండ బలాన్ని, మందబలాన్ని, డబ్బు, ఒత్తిళ్లు, దర్యాప్తు సంస్థలను విచ్చలవిడిగా వాడుకుంటున్నది’ అని ఆరోపించారు.

మేయర్‌ ఎన్నికలోనే ఇంతటి నీచానికి పాల్పడ్డారంటే.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని కుతంత్రాలకైనా తెగిస్తుందని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించా. చండీగఢ్‌ ఇండియా కూటమి అభ్యర్థి కుల్దీప్‌సింగ్‌కు పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సైడింగ్‌ అధికారిపై చర్యలు తీసుకోవాలి. ఆయనను అరెస్టు చేయాలి. ఆయన అక్రమానికి పాల్పడ్డారు. విచారణ కోసమే కాదు.. ఆయనను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఫిర్యాదు చేస్తాం’ అని ఆప్‌ ఎంపీ రాఘవ్‌ ఛద్దా చెప్పారు. ఈ ఓటమి ఒక కూటమికో లేదా పార్టీకో కాదని, యావత్‌ భారతదేశ ప్రజాస్వామ్యానికని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇంకెంతటి అక్రమాలకు పాల్పడుతారోనన్న ఆందోళన తమను వెంటాడుతున్నదని చెప్పారు.

Exit mobile version