Site icon vidhaatha

Ashok Mody | జీడీపీ వృద్ధిరేటు 4.5శాతమే!.. జీ20 ముందు రంగులేసి జిమ్మిక్కు: ప్రొఫెసర్‌ అశోక్‌ మోదీ

Ashok Mody

విధాత, లండన్‌: స్థూల జాతీయోత్పత్తిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగులేసి సుందరీకరించిందని, జీ20 సమావేశాల ముందు అంకెలతో జిమ్మిక్కు చేసిందని బ్రిటన్‌లోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అశోక్‌ మోదీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చెబుతున్నట్టు జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతం లేదని, అది కేవలం 4.5 శాతం మాత్రమేనని స్పష్టం చేశారు.

ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలతో దేశం అభివృద్ధి సాధించిందని ప్రపంచ దేశాల ముందు గొప్పలకు పోయేందుకు జరిగిన ప్రయత్నమేనని పేర్కొన్నారు. అశోక్‌మోదీ.. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ప్రభుత్వం విడుదల చేసిన డాటాపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ‘ఇండియాస్‌ ఫేక్‌ గ్రోత్‌ స్టోరీ’ పేరిట వ్యాసం రాశారు. దేశ మీడియాలోనే కాకుండా, ప్రపంచ మీడియాలోనూ ఇది చర్చనీయాంశం అయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌.. మూడు నెలల్లోనే జీడీపీ వృద్ధిరేటు 7.8 శాతానికి పెరిగిందని ఏ పద్ధతిని అనుసరించి లెక్కగట్టారని అశోక్‌మోదీ ప్రశ్నించారు.

జీ20 సదస్సు నేపథ్యంలోనే డాటాకు రంగులు పులిమి, అందంగా మార్చి లెక్కలు రూపొందించారని విమర్శించారు. దేశ ఆర్థికాభివృద్ధిని ప్రపంచ దేశాలు ప్రశంసించేలా అంకెల గారడీ చేశారని తేల్చి చెప్పారు. జీడీపీ వృద్ధిరేటును అంచనా వేసేందుకు రెండు వేర్వేరు పద్ధతులు ఉంటాయన్న అశోక్‌మోదీ.. అందులో ఒకటి దేశ ఉత్పత్తి/ ఆదాయాన్ని లెక్కించేది, రెండోది దేశ వ్యయాన్ని లెక్కించే పద్ధతి ఉంటాయని తెలిపారు.

అయితే ఈ రెండు పద్ధతుల్లోనూ వృద్ధిరేటును లెక్కించేటప్పుడు గణాంకాల్లో తేడాలు కనిపిస్తాయని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు దేశ ఆదాయాన్ని మాత్రమే లెక్కగట్టి జీడీపీని అంచనా వేసిందేనని ఇందులో వ్యయం విషయం నామ మాత్రంగా చూపించారని పేర్కొన్నారు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్‌వో) వెలువరించిన గణాంకాలు తప్పుల తడక అని ఆయన స్పష్టం చేశారు.

ఎన్‌ఎస్‌వో డాటా ప్రకారం.. ఆదాయం 7.8% శాతానికి పెరిగిందని, అదే ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఖర్చు మాత్రం 1.4%గా చూపించడమేంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఈ రెండూ తప్పుడు లెక్కలేనని స్పష్టం చేశారు. ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు వ్యయం కూడా అంతకు తగ్గట్టుగానే ఉంటుందనే ప్రాథమిక సూత్రాన్ని ఇక్కడ ఎగరగొట్టారని వివరించారు.

జీడీపీని లెక్కగట్టేందుకు అంతర్జాతీయంగా అందరూ ఆమోదించిన పద్ధతిని పక్కనపెట్టి.. వారికి నచ్చిన శైలిలో రూపొందించారని విమర్శించారు. ఆస్ట్రేలియా, జర్మనీ, ఇంగ్లండ్‌ దేశాలు జీడీపీని లెక్కించడంలో ఆదాయం, వ్యయం.. రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటాయని తెలిపారు. అమెరికాలో వ్యయం వైపు నుండి డాటా తీస్తారని పేర్కొన్నారు.

ఆ తరువాత ఆదాయాన్ని, వ్యయాన్ని సరాసరి పోల్చి జీడీపీ వృద్ధిని నిర్ణయిస్తారని వివరించారు. తాము ఈ పద్ధతిలో గణాంకాలు తీయగా.. 7.8శాతం పెరుగుదల రేటు లేకపోగా.. 4.5 శాతం మాత్రమే ఉన్నదని తెలిపారు. భారత ప్రభుత్వం వాస్తవాలను పక్కనపెట్టి.. జీ20 సందర్భంగా అందరూ ఆనందపడే, ప్రశంసించే డాటాలను మాత్రమే ప్రదర్శించారని తేల్చి చెప్పారు.

Exit mobile version