పేరు ‘స్టేషన్’ రూటు మాత్రం సపరేటు

పేరులో ఘనం ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం పూర్‌ అన్నట్టు తయారైంది స్టేషన్‌ ఘన్‌పూర్‌ పరిస్థితి. దీన్ని పట్టించుకోని నాయకుల.. జుగుప్సాకరమైన దూషణ భాషణలతో పరువు తీస్తున్నారన్న ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతున్నది.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

పేరుకు అది ‘స్టేషన్’ ఘన్‌పూర్‌. దాని పొలిటికల్ రూటు మాత్రం సపరేటు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నారు. ఎవరిక్కడ ఎమ్మెల్యే అనేదానికి సంబంధం లేకుండా తరచూ రాజకీయ రచ్చ ఇక్కడ ‘ఘనం’గా సాగుతోంది. ఇక్కడి నుంచి అంతా ఘనాపాటీలు ప్రాతినిధ్యం వహించినప్పటికీ అభివృద్ధిలో ‘పూర్’ అంటూ ఈ అంశమే పట్టనట్లు నేతలు సిగపట్లుపడుతున్నారు. ప్రధాన పార్టీల అధినాయకత్వాలు పొగబెట్టి నిప్పుల కుంపటి ఆరకుండా జాగ్రత్తవహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెద్ద చదువులు చదువుకున్న ఈ ‘నేతలు’ ఈ ఉచ్చులో చిక్కుకుని పావులుగా మారుతున్నారనే చర్చసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమొచ్చిన తర్వాతనైనా ఏమైనా మార్పు ఉంటుందా? అంటే అలా ఎలా ఉంటామంటూ పోటీలుపడుతూ నిత్యం వార్తల్లో వ్యక్తులుగా మారుతున్నారు. అవినీతి, అనైతిక, ఆర్ధిక ఆరోపణలే కాకుండా వ్యక్తిత్వహననాలు, దూషణలు, పరుష వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. నాయకుల మధ్య జుగుప్సాకరమైన నిందా వ్యాఖ్యలు నిత్యమిక్కడ సాధారణమయ్యాయి. సవాళ్ళు, ప్రతిసవాళ్ళు, చాలెంజులు విసురుకుంటూ ‘బ్యాక్ గ్రౌండ్’ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయి, వారి రాజకీయ అవసరాలు తీర్చే సాధనాలుగా మారుతున్నారనే ఆవేదన కింది వర్గాల నుంచి వచ్చిన మేధావుల్లో వ్యక్తమవుతోంది.

రాజకీయ రచ్చలో ఘనం

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గమంటేనే రాజకీయ రచ్చకు కేంద్ర బిందువుగా మారింది. నిన్నటికి నిన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన ఒంటికాలితో లేచారు. తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశమైన ‘జాతిపిత’ అంశంపై స్పందిస్తూ కేసీఆర్ ఎవరికి జాతిపిత అంటూ… వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అవినీతిలోకూరుకుపోయి కేసుల్లో ఇరుక్కున్నారని, అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదంటూ విమర్శించారు. ఈ విమర్శల బీఆర్ఎస్ మ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కడియం ఓ రాజకీయ బ్రోకర్ అంటూ విమర్శించారు. కడియం బీఆర్ఎస్ కు దూరమైనప్పటి నుంచి కడియం పల్లా మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఇక దీనికి ముందు నుంచి స్టేషన్ కేంద్రంగా డాక్టర్ రాజయ్య కడియం మధ్య బద్ద రాజకీయ వైరం కొనసాగుతూనే ఉన్నది. ఇద్దరు నాయకులు ఒకే టీఆర్ఎస్ లో కొనసాగినా ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకున్న వారే కావడం గమనార్హం. ఈ మధ్యలో కడియం, ఎర్రబెల్లి మధ్య విమర్శలు సాగాయి. ఈ క్రమంలో కడియం పై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తే అంతే స్థాయిలో కడియం ఫైరయ్యారు. కడియం పార్టీ మారినప్పటి నుంచి ప్రారంభమైన విమర్శలు, ఆరోపణలు ఎంపీ ఎన్నికల్లో తీవ్రరూపం దాల్చాయి. ఆ తర్వాత తరచూ విమర్శించుకుంటున్నారు. నిన్న ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం పరస్పరం దూషించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో కడియం కాసింత పైచేయి సాధించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోచేరి ఎంపీగా పోటీచేసిన అరూరి రమేష్ తిరిగి బీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి డాక్టర్ రాజయ్య కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నారనే చర్చసాగుతోంది. ఇటీవల కడియం స్థానిక నాయకులకంటే బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్, కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇదే స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు కడియం పై విరుచుకపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సైతం కడియం శ్రీహరి పై వరంగల్ తూర్పు నాయకుడు నన్నపనేని నరేందర్ తో తెలంగాణ భవన్ వేదికగా కడియం పై తీవ్ర దూషణలు చేయడం గమనార్హం.

అభివృద్ధిలో ‘పూర్’

హైదరాబాద్, వరంగల్ రోడ్డు మధ్యలో ఉండే స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం అటు జనగామ పట్టణానికి, ఇటు వరంగల్ నగరానికి మధ్య ప్రధాన కేంద్రంగా కొనసాగుతున్నప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలోనే ఉందనే అభిప్రాయాలున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ నియోజకవర్గాన్ని విస్మరించారనే చర్చ ఇప్పటికీ ఉంది. అధికారంపై ఉన్న మక్కువ, అభివృద్ధి పై లేదంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన హయగ్రీవాచారి, గోక రామస్వామి, కడియం శ్రీహరి, డాక్టర్ విజయరామారావు, డాక్టర్ రాజయ్యలు ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. ఇందులో కడియం శ్రీహరి అయితే టీడీపీలో సుదీర్ఘకాలం, టీఆర్ఎస్లో ఒక టర్మ్ మంత్రిగా పనిచేశారు. అయినా అభివృద్ధి పట్టించుకోలేదని, మొన్నటికి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీకాలేజీ మంజూరైందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. రాజకీయ విమర్శలు కాదనలేనప్పటికీ, జుగుప్సాకరమైన దూషణలు పక్కన పెట్టి నియోజకవర్గ సమస్యల పరిష్కారం పై నేతలు దృష్టిపెట్టాలని కోరుతున్నారు.

Latest News