Site icon vidhaatha

యూపీఐ యూజర్లకు తీపికబురు..! ట్రాన్సాక్షన్‌ లిమిట్‌ను భారీగా పెంచిన ఆర్‌బీఐ..!

విధాత‌: యూపీఐ వినియోగదారులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీపి కబురును అందించింది. యూపీఐ పేమెంట్స్‌ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకునున్నది. కీలకమైన లావాదేవీలకు యూపీఐ పేమెంట్స్‌ను రూ.5లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ద్రవ్య విధాన నిర్ణయాల్లో భాగంగా ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఈ ప్రకటన చేసింది. దేశంలో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.


యూపీఐ పేమెంట్స్‌ను రూ.5లక్షలకు పెంచగా.. అందులో ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఉన్నాయి. ఇప్పటి వరకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు మాత్రమే పంపేందుకు వీలుండగా.. ఇకపై రూ.5లక్షల వరకు చెల్లించేందుకు ఆర్‌బీఐ వీలు కల్పిస్తున్నది. మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలకు సంబంధించి విధాన పరమైన నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూపీఐ పేమెంట్లకు సంబంధించిన నిర్ణయాలను సైతం ఆయన వెల్లడించారు. వివిధ కేటగిరిలకు సంబంధించి ట్రాన్సాక్షన్ల లిమిట్ అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని.. తాజాగా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్లకు యూపీఐ ట్రాన్సాక్షన్ల లిమిట్‌ను రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.


అలాగే యూపీఐకి సంబంధించి ఆర్‌బీఐ గవర్నర్‌ మరో ప్రకటన చేశారు. మ్యూచువల్ ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్స్, క్రెడిట్ కార్డు రీపేమెంట్స్‌కు సంబంధించి రికరింగ్ పేమెంట్లలో అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (AFA) అవసరం లేకుండా రూ.లక్ష వరకు ఆటో పేమెంట్స్ చేయవచ్చని చెప్పారు. రికరింగ్ చెల్లింపుల ఈ-మ్యాండేట్ పరిమితి రూ.15వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు చెప్పారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే రూ.లక్ష వరకు ఆటో పేమెంట్‌ వీలుంటుంది. ఇప్పటి వరకు రూ.15వేలు దాటిన రికరింగ్ పేమెంట్లకు అథెంటికేషన్ అవసరం అయ్యేది. కానీ, ఇకపై రూ.లక్ష వరకు ఎలాంటి అథెంటికేషన్ లేకుండానే పేమెంట్స్ చేసే వీలుంటుంది.

Exit mobile version