South Korea
విధాత: భారీ వర్షాలతో సతమతమవుతున్న దక్షిణ కొరియా (South Korea) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బస్సు సహా 15 వాహనాలు భారీ టన్నెల్‌లో చిక్కుకుపోగా వాటిని వరద నీరు ముంచేసింది. ఆ వాహనాల్లో ఉన్న వారంతా ఆ టన్నెల్‌లోనే ఉండిపోయారు. అందులోకి భారీగా నీటి ప్రవాహం ఉండటంతో సహాయక సిబ్బంది టన్నెల్‌లో చిక్కుకున్న వారి దగ్గరకు వెళ్లలేకపోయారు.
తాజాగా సుమారు 13 మంది మృతదేహాలను వెలికితీశామని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. వీరితో కలిపి దేశంలో వరదల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 40కి చేరింది. అయితే టన్నెల్‌లో ఇంకా ఎంత మంది ఉన్నారనే దానిపై ప్రభుత్వ వర్గాలు మౌనం పాటిస్తున్నాయి. వరద వచ్చే సూచన ఉన్నప్పుడు అధికారులు ఎందుకు ఆ మార్గాన్ని మూసివేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వాహనాలు ప్రయాణిస్తుండగా భారీ వరద వాటిని ముంచెత్తడం టన్నెల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ‘నేను కూడా చనిపోయేవాడినే.. తృటిలో బయటపడ్డాను. ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది’ అని ఆ టన్నెల్ ద్వారా ఎక్కువగా ప్రయాణించే 60 ఏళ్ల కాంగ్ సియాంగ్ ప్యో తెలిపారు.