BRS | ఓరుగ‌ల్లులో కారు బేజారు! ఇద్దరు ఎమ్మెల్యేల‌పై తీవ్ర ఆరోప‌ణలు

BRS | బీఆర్ఎస్ పరువు బజారు పాలు కేసీఆర్‌ మౌనం వెనుక మతలభేమిటి? మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి ప్రేక్షకపాత్ర విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓరుగ‌ల్లులో గులాబీ కారు (BRS) రివ‌ర్స్ గేరులో వెళ్తున్న‌ది. జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పైన తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ నుంచే ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టం విశేషం. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై క‌బ్జాకోరు అని క‌న్న‌బిడ్డే నిల‌దీసిన ప‌రిస్థితి. స్టేషన్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ […]

  • Publish Date - June 29, 2023 / 12:30 AM IST

BRS |

  • బీఆర్ఎస్ పరువు బజారు పాలు
  • కేసీఆర్‌ మౌనం వెనుక మతలభేమిటి?
  • మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి ప్రేక్షకపాత్ర

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఓరుగ‌ల్లులో గులాబీ కారు (BRS) రివ‌ర్స్ గేరులో వెళ్తున్న‌ది. జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పైన తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ నుంచే ఈ ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టం విశేషం. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై క‌బ్జాకోరు అని క‌న్న‌బిడ్డే నిల‌దీసిన ప‌రిస్థితి.

స్టేషన్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యపై గ్రామ మ‌హిళా స‌ర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోఫ‌ణ‌లు చేసిన దుస్థితి. ఈ రెండు వ్య‌వ‌హారాలు జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌నీయంశంగా మారి పార్టీ పరువు బజారున పడినప్పటికీ అధిష్ఠానం ప‌ట్టించుకోక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తున్న‌ది. జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు కూడా వీరి అంశంపై నోరుమెదపకపోవడంలో మర్మమేమిటనే ప్రశ్నలు వ‌స్తున్నాయి.

మొద‌టి నుంచి ముత్తిరెడ్డి వివాద‌స్ప‌దుడే

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొద‌టి నుంచి వివాదాస్ప‌దుడే. చెరువు శిఖం క‌బ్జా విష‌యంలో గ‌తంలో ఏకంగా జిల్లా క‌లెక్ట‌ర్‌తోనే పెట్టుకున్నారు. అప్ప‌డు అధిష్ఠానం అండ‌గా నిలువ‌డంతో ఆమె బ‌దిలీకావ‌డంతోపాటు వివాదం స‌ద్దుమ‌ణిగింద‌నే ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో వ‌చ్చాయి. ఇటీవ‌ల స్వయంగా తన క‌న్న‌ బిడ్డ తుల్జా భవానిరెడ్డి గత కొద్ది కాలంగా తీవ్ర ఆరోపణలు చేశారు. చేర్యాలలో తన తండ్రి ఆక్రమించి, తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసిన ప్ర‌భుత్వ భూమిని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానంటూ బాహాటంగా ప్రకటించారు. ఆ స్థ‌లం ప్ర‌హ‌రీని సైతం కూల్చివేశారు. ఇందుకు సంబంధించి వార్త‌లు అన్ని మీడియాలో వ‌చ్చాయి.

ప‌ట్టించుకోని ప్ర‌భుత్వం

క‌బ్జా ఘటన వెనుక నిజానిజాలేంటిదో తేల్చాల్సిన స్థానంలో ఉన్న ప్రభుత్వంగానీ, అధికార పార్టీ పెద్దలు కానీ స్పందించకపోవడం పట్ల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే ఆక్రమిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవచ్చూ. ఆ భూమి పట్టా భూమి, ఎమ్మెల్యే న్యాయంగానే కొనుగోలు చేసినట్లు తేలితే ప్రజలకు వివరించవచ్చూ. ఇవేమీ పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజయ్య పై లైంగిక వేధింపుల ఆరోపణ

స్టేషన్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై ఆయన సొంత నియోజకవర్గం ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్, బీఆర్ ఎస్‌కు చెందిన నవ్య మార్చి నెలలో ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. అప్పుడు ఆమె తన భర్తతోకలిసి ఈ ఆరోపణలు చేశారు. మూడురోజుల తర్వాత తర్వాత ఎమ్మెల్యే, సర్పంచ్ ఇద్దరూ రాజీకొచ్చి కలిసి మీడియా సమావేశం పెట్టారు. ఇక ముందు ఆ పరిస్థితి తలెత్తే అవకాశం లేదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సర్పంచ్ కోరారు. మూడు నెలల తరువాత తాజాగా సర్పంచ్ నవ్య మళ్లీ మీడియా ముందుకొచ్చింది.

మళ్ళీ మొదటికొచ్చిన ఆరోపణ

ఎమ్మెల్యే రాజయ్య తన భర్తని ప్రలోభ పెట్టి తన దగ్గరున్న సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నంచేస్తున్నారని సర్పంచ్ నవ్య ఆరోపించారు. ఆడియో, వీడియో రికార్డులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. అప్పుడు ఇస్తామని చెప్పిన గ్రామాభివృద్ధి నిధులు రూ.20 లక్షలు ఇవ్వాలంటే కాగితం రాసి సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు.

తర్వాత ఈ విషయం పై ఎమ్మెల్యే,ఆయన పిఎ, ఎంపిపి, తన భర్త మీద సర్పంచ్ నవ్య పోలీస్ స్టేషన్లో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా, కేసు నమోదు చేయాలని తర్వాతే ఆధారాలు సమర్పిస్తానని ఆమె తాజాగా డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కోరారు. కానీ, ఆధారాలు లేవ‌ని ఎమ్మెల్యేపై కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని ఆమె ఆరోపించారు.

మంత్రుల మౌనం వెనుక మ‌త‌ల‌బేమిటి?

జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ ఈ రెండు నియోజకవర్గాల పరిధి జనగామ జిల్లా కు చెందిన మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు కావడం గమనార్హం. పైగా ఆయన ఉమ్మడి జిల్లాకు మంత్రులుగా ఎర్రబెల్లి, సత్యవతి వ్యవహరిస్తున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా మహిళా అయి ఉండి మహిళలు చేస్తున్న ఆరోపణలపై కనీసం నోరు మెదపకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి తోడు ఇటీవల పలు సందర్భాలలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జిల్లాలో పర్యటించారు. అయినప్పటికీ ఈ విషయమై కనీసం నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి లోను చేస్తుంది. మంత్రులు, అధిష్టానం మౌనం వెనుక రెండు కారణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు వచ్చిన సమయాల్లో బిఆర్ఎస్ పార్టీ మౌనం వహించడం ఒక ఎత్తుగడగా అమలు చేస్తుంది. ఈ లోపు సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లుతున్న‌ద‌నిఆ పార్టీ భావిస్తున్న‌ది.

గ‌తంలోనూ కొన్ని ఘ‌ట‌న‌లు

గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మానుకోట, జనగామ, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలపై వివిధ ఆరోపణలు వచ్చిన సమయంలో ఇదే తీరుగా వ్యవహరించి కాలం దాటవేసింది. ఈసారి కూడా అదే ప్రణాళికను అమలు చేస్తుందని కొందరు వాదిస్తుండగా, దీనికి భిన్నమైన అభిప్రాయాలు మరి కొందరు వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత, ఆరోపణలొచ్చిన ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పై ఇద్దరి ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించాలంటే వారిపై వచ్చే ఆరోపణలు పైన చర్చ జరగాలని భావిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక అధిష్టానం అనుకూల వ్యక్తుల ప్రోద్బలం ఉందంటున్నారు.

Latest News