Sharad Pawar | అప్రజాస్వామ్యానికి లొంగం.. ప్రజామద్దతుతో బలం పుంజుకుంటాం: శరద్‌పవార్‌

Sharad Pawar కులమతాల పేరిట దేశంలో చీలికకు కుట్ర బీజేపీకి వ్యతిరేకంగా మేం నిలబడ్డాం కానీ.. కొందరు వారికి మోకరిల్లారు బహిరంగ సభలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ ముంబై: అప్రజాస్వామిక శక్తులకు మహారాష్ట్ర ప్రజలు లొంగేది లేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ చెప్పారు. కరాడ్‌లో యశ్వంత్‌ చవాన్‌ సమాధి వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ దేశంలోనూ, ‘ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వాన మా ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంటే.. కొందరు దాన్ని కూలదోశారు. దేశంలోని కొన్ని […]

  • Publish Date - July 3, 2023 / 02:02 PM IST

Sharad Pawar

  • కులమతాల పేరిట దేశంలో చీలికకు కుట్ర
  • బీజేపీకి వ్యతిరేకంగా మేం నిలబడ్డాం
  • కానీ.. కొందరు వారికి మోకరిల్లారు
  • బహిరంగ సభలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌

ముంబై: అప్రజాస్వామిక శక్తులకు మహారాష్ట్ర ప్రజలు లొంగేది లేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ చెప్పారు. కరాడ్‌లో యశ్వంత్‌ చవాన్‌ సమాధి వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ దేశంలోనూ, ‘ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వాన మా ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుంటే.. కొందరు దాన్ని కూలదోశారు.

దేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌.. ఇలా ప్రజాతంత్రయుతంగా ప్రభుత్వాలు పనిచేస్తున్న చోట్ల దాడులు జరిగాయి’ అని ఆయన చెప్పారు.

ఏక్‌నాథ్‌ శిండే ప్రభుత్వంలో చేరిన తన మేనల్లుడు అజిత్‌పవార్‌ పేరు ప్రస్తావించకుండా.. ‘మహారాష్ట్ర ప్రజలు అప్రజాస్వామిక శక్తులకు మోకరిల్లరు’ అని చెప్పారు. ‘రాష్ట్రంలోనూ, దేశంలోనూ కులమతాల పేరిట గ్రూపుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేం బీజేపీకి వ్యతిరేకంగా నిలబడేందుకు ప్రయత్నిస్తుంటే.. దురదృష్టవశాత్తూ మాలో కొందరు వారికి పావులుగా మారారు’ అని అన్నారు.

ప్రజా మద్దతుతో తాము మరింత బలం పుంజుకుంటామని చెప్పారు. అప్రజాస్వామిక శక్తులకు తలొగ్గేది లేదని, మహారాష్ట్ర మళ్లీ ప్రగతి పథాన పయనిస్తుందని స్పష్టం చేశారు. అంతకు ముందు ప్రీతి సంగమ్‌ మెమోరియల్‌లోని తన రాజకీయ గురువు, మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్‌రావు చవాన్‌ సమాధిని సందర్శించి, నివాళులర్పించారు.