Shikhar Dhawan: ఒకప్పుడు టీమిండియా ఓపెనర్‌గా ఉన్న శిఖర్ ధావన్ ఇప్పుడు జట్టులో చోటు కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్లుగా శిఖర్ ధావన్ టీంలో కనిపించడం లేదు. కొత్త కుర్రాళ్లకి ఎక్కువ అవకాశాలు ఇస్తూ సీనియర్స్‌ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ ఓ మోస్తరు ఫామ్ లో ఉన్నప్పుడే జట్టులో చోటు కోల్పోయాడు. గణాంకాలన్నీ మెరుగ్గా ఉన్నా కూడా శిఖర్ ధావన్‌ని ఏ సిరీస్‌కి కూడా ఎంపిక చేయడం లేదు. చైనాలో సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య జరగనున్న ఆసియన్ గేమ్స్‌కు సెలెక్టర్లు.. ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరగనున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లని బీసీసీఐ ఎంపిక చేసింది. శిఖర్ ధావన్ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతుందని అందరు అనుకున్నారు. కాని ఆయనకు జట్టులో చోటు కూడా దక్కలేదు.
సెలెక్టర్లు తనని ఎంపిక చేయకపోవడంపై శిఖర్ ధావన్ మౌనం వీడాడు. ఆసియర్ గేమ్స్ జట్టులో తన పేరు లేకపోవడంతో షాక్ అయినట్టు శిఖర్ అన్నాడు. అయితే బీసీసీఐ, సెలక్టర్స్ వేరే ఆలోచనా విధానంతో ఆలోచిస్తున్నారని నేను భావించారు. జట్టులో అందరు యువఆటగాళ్లే ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్‌గా ఎంపిక చేయడం సంతోషాన్ని కలిగించింది. యువ ఆటగాళ్లు అందరు కూడా బాగా రాణిస్తారని నేను భావిస్తున్నాను అని శిఖర్ ధావన్ చెప్పాడు. ఇక గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన బంగ్లాదేశ్ సిరీస్ తర్వాతి నుంచి శిఖర్ ధావన్ టీమిండియా తరపున ఆడింది లేదు.
యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మంచి ఫాంలో ఉండడంతో రోహిత్ శర్మతో కలిసి గిల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. వరల్డ్ కప్‌లో కూడా వారిద్దరే ఓపెనింగ్ చేయనున్నట్టు సమాచారం. అయితే అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటానని చెప్పిన ధావన్.. ఫిట్ నెస్ కొనసాగిస్తాను. ఒక శాతం లేకపోతే 20 శాతం ఎప్పుడూ ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక తాను విజయ్ హజారే వన్డే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 దేశవాళీ టోర్నీలు ఆడాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్‌కి పంజాబ్ తరపున ఆడుతున్న శిఖర్ వచ్చే ఏడాది కూడా అదే టీంలో కొనసాగనున్నట్టు తెలుస్తుంది.