ICC ODI Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డు సాధించాడు. 10 సార్లు టాప్-2లో సంవత్సరం ముగించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ICC ODI Rankings

విధాత : టీమిండియా రన్ మెషిన్, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది 2025 చివరి రోజు విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకిన విరాట్‌.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ చరిత్రలో అత్యధిక సార్లు (10) టాప్‌-2లో సంవత్సరాన్ని ముగించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో వరుసగా 2017, 2018, 2019, 2020 సంవత్సరాలను టాప్-1 బ్యాటర్‌గా.. 2013, 2014, 2015, 2016, 2021, 2025 సంవత్సరాలను రెండో నంబర్ బ్యాటర్‌గా ముగించాడు. ఈ రికార్డును విరాట్‌ మరో దిగ్గజ బ్యాటర్‌, విండీస్‌ యోధుడు వివ్‌ రిచర్డ్స్‌ (9), సౌతాఫ్రికా లెజండరీ ఆల్‌రౌండర్‌ షాన్‌ పొల్లాక్‌తో (9) కలిసి షేర్‌ చేసుకున్నాడు. తాజాగా సింగిల్‌గా ఈ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.

డిసెంబర్‌ నెలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండు శతకాలు, ఓ అర్ధశతకం సాయంతో 302 పరుగులు చేసిన విరాట్‌.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. 2025లోనే టెస్ట్‌లకు, అంతకుముందు ఏడాది టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్‌.. వన్డేల్లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శనలు కనబర్చాడు. 13 మ్యాచ్‌ల్లో 3 శతకాల సాయంతో 651 పరుగులు చేశాడు. ఇందులో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో పాక్‌పై సాధించిన విరాట్ శతకం చిరస్మరణీయం.

2025ను నంబర్ వన్ బ్యాటర్‌గా ముగించిన ఆటగాడిగా రోహిత్ శర్మ

భారత బ్యాటింగ్ దిగ్గజం రోహిత్‌ శర్మ 2025ను నంబర్‌ వన్‌ ఐసీసీ ర్యాంకర్ గా ముగించాడు. రోహిత్‌కు విరాట్‌కు రేటింగ్‌ పాయింట్ల పరంగా కేవలం 8 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్‌ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్‌ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

New Year 2026 Celebrations : న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో న్యూఇయర్ సంబరాలు షురు
Kavitha : తెలంగాణ ఉద్యమకారులకు 250గజాల భూమి ఇవ్వాలి

Latest News