Sirnapalli Palakova | పాల‌కోవాకు.. ఆ ఊరు చాలా ఫేమస్.. ఎక్కడ చూసినా అవే! ఎక్కడో తెలుసా..?

విధాత‌: ఆ ఊరు పేరు చెప్తే అందరికీ నోరూరించే మధురమైన పాలకోవా (Palakoa Sweet) గుర్తుకొస్తది.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే స్వచ్ఛమైన కోవాకు ఆ గ్రామం ఫేమస్.. సాధారణంగా ఏ మిఠాయి దుకాణాల్లో అయినా పాలకోవా దొరుకుతది కానీ స్వచ్ఛతలో, రుచిలో ఆ ఊరి కోవాకు సాటి రావు. అందుకే అక్కడ తయారు చేసిన పాలకోవా దేశ విదేశాలకు కూడా వెళుతుంది. తమ పూర్వీకుల నుంచి వస్తున్న పాలకోవా తయారీ వృత్తిని కొనసాగిస్తూ మధురమైన కోవా తయరి […]

  • Publish Date - April 19, 2023 / 02:12 PM IST

విధాత‌: ఆ ఊరు పేరు చెప్తే అందరికీ నోరూరించే మధురమైన పాలకోవా (Palakoa Sweet) గుర్తుకొస్తది.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే స్వచ్ఛమైన కోవాకు ఆ గ్రామం ఫేమస్.. సాధారణంగా ఏ మిఠాయి దుకాణాల్లో అయినా పాలకోవా దొరుకుతది కానీ స్వచ్ఛతలో, రుచిలో ఆ ఊరి కోవాకు సాటి రావు. అందుకే అక్కడ తయారు చేసిన పాలకోవా దేశ విదేశాలకు కూడా వెళుతుంది.

తమ పూర్వీకుల నుంచి వస్తున్న పాలకోవా తయారీ వృత్తిని కొనసాగిస్తూ మధురమైన కోవా తయరి తో ఆదాయాన్ని గడిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ గ్రామ పాడి రైతులు. ఇంతకీ ఆ ఊరిలో తయారయ్యే పాలకోవా ప్రత్యేకత ఏంటి ?ఆ ఊరు ఎక్కడ ఉంది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇది నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం సిర్నాపల్లి గ్రామం.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా పాలకోవా తయారీ కేంద్రాలు కనిపిస్తాయి.. ఇక్కడి పాడి రైతులు పాలను విక్రయించి ఆదాయం పొందకుండా వెరైటీగా ఆ పాలతో మధురమైన పాల కోవాను తయారు చేసి విక్రయిస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు.

అలాగని లాభార్జనే ధ్యేయంగా కాకుండా స్వచ్ఛమైన పాలతో మధురమైన కోవాను తయారు చేస్తూ పేరు సంపాదించుకున్నారు. అందుకే జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా సిర్నాపల్లి పాల కోవాను ఎంతో ఇష్టపడతారు.. ఇక్కడ తయారైన పాలకోవాను విదేశాలకు కూడా పంపిస్తుంటారు.. ఇంగ్లాండ్ అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్న ప్రవాస భారతీయులు ఎంతో ఇష్టంగా ఈ కోవాను తీసుకెళ్తుంటారు.

కేవలం పండగలకు పబ్బాలకే కాకుండా నిత్యం పాలకోవా తయారు చేస్తుంటారు ఈ గ్రామస్తులు.. సిర్నాపల్లి గ్రామంలో ఏ ఇంటిని చూసినా పాడి పశువులు దర్శనమిస్తాయి.. అంతేకాదు ప్రతి ఇంటి ముందు కోవా తయారు చేసే పొయ్యి, పాండేలు కనిపిస్తుంటాయి.

ఇక్కడి పాడి రైతులువేకువజామునే నిద్రలేచే పాలు పితికి ఉదయాన్నే కోవా తయారీలో నిమగ్నం అవుతుంటారు. కుటుంబమంతా కూడా ఈ పాలకోవా తయారీ పైనే ఆధార పడి జీవిస్తుంటారు.. వీరు తయారు చేసిన పాలకోవాను నగరాలకు పంపించేవారు.

అయితే ఇటీవల ఐకెపి ద్వారా గ్రామంలోని పాలకోవా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు.. గ్రామంలో తయారైన కోవాను ఈ విక్రయ కేంద్రంలో అమ్ముతుంటారు.. మరికొంతమంది పాడి రైతులు నేరుగా నిజామాబాద్ హైదరాబాద్ కరీంనగర్ లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు.

ఇక సిర్నాపల్లిలో రైల్వే స్టేషన్ ఉండటం కూడా వీరు ఈ వృత్తి ఎంచుకునేందుకు కారణంగా మారిందని చెప్పవచ్చు.. పూర్వం నుంచి కూడా ఈ గ్రామంలో పాడి సంపద ఎక్కువ.. అందుకే అధికంగా వచ్చే పాలతో కోవాను తయారు చేస్తూ సిర్నాపల్లి రైల్వే స్టేషన్లో విక్రయించేవారు.

అలా మొదలైన పాలకోవా విక్రయం ఇప్పుడు అన్ని నగరాలకు చేరింది.. మార్కెట్లో సిర్నాపల్లి పాలకోవాకు మంచి డిమాండ్ ఉంటుంది.. ప్రస్తుతానికి కూడా గ్రామంలో 60 కుటుంబాలు పాలకోవాను తయారు చేస్తూ ఆదాయాన్ని గడిస్తూ తమ పిల్లలని పై చదువులు చదివిస్తున్నారు.. పురుషులు మహిళలు యువకులు తేడా లేకుండా అందరూ కోవా తయారు చేస్తుంటారు.

మధురాతి మధురం సిర్నాపల్లి పాలకోవా

అందరిలాగా కాకుండా సిర్నాపల్లి వాసులు విభిన్నంగా పాల కోవాను తయారు చేస్తుంటారు.. స్వచ్ఛమైన పాలలో ఎలాంటి పదార్థాలు వాడకుండా కొవాను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.. ఇందుకోసం వీరు కట్టెల పొయ్యిని మాత్రమే వాడుతుంటారు.

పాలు తగు సమయంలో తగినంతమరగడంలో కట్టెల పొయ్యి ఎంతో ప్రాధాన్యం అని చెప్తుంటారు. మూడు లీటర్ల పాలతో కిలో కోవాను తయారు చేస్తారు.. ఒక్క కిలో కోవాను 300 రూపాయలకు విక్రయిస్తారు.. సాధారణంగా పాలు అమ్ముకుంటే లీటర్ పాలకు 40 రూపాయలకు మించి ఆదాయం రాదు.

కానీ ఈ కోవాను తయారుచేసి విక్రయిస్తే అధిక లాభాన్ని పొందవచ్చు అంటున్నారు గ్రామస్తులు.. కేవలం స్వచ్ఛమైన పాలను మూడు గంటల పాటు కట్టెల పొయ్యిపై వేడి చేసి కోవాను తీస్తామని చెప్తున్నారు.. అందుకే నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుంది తాము తయారు చేసిన కోవా అంటున్నారు.

ఇతర ప్రాంతాల్లో కూడా తాము తయారు చేసిన పాలకోవాకు మంచి గుర్తింపు రావడం గర్వకారణంగా ఉందని చెప్తున్నారు.. తమ ఖర్చులన్నీ పోను ఒక్కో నెలకు దాదాపు 15 వేల వరకు ఆదాయం వస్తుందని అంటున్నారు.. పూర్వీకుల నుంచి ఇప్పటివరకు కూడా సిర్ణపల్లి పాలకోవాకు ఎంతో డిమాండ్ ఉందని ఇందుకు స్వచ్ఛత ఒకటే కారణమని చెప్తున్నారు గ్రామస్తులు.

Latest News