విధాత: ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోందని..అందుకే ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వ నర్సరీ, ప్లే స్కూల్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామన్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy ) మాట్లాడారు. దేశ ప్రధాని నెహ్రూ ఎడ్యూకేషన్, ఇరిగేషన్ దార్శనిక విధానాలతో బిజిలీ, పానీ, సడక్ ల అభివృద్ధితో అధునిక భారత నిర్మాణానికి బాటలు వేశారన్నారు. నెహ్రూ సారథ్యంలోనే దేశంలో యూనివర్సిటీలకు పునాదులు పడ్డాయని, ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత్ చేరిందన్నారు. ప్రధాన ప్రాజెక్టులన్ని ఆయన హయాంలోనే నిర్మితమైనాయన్నారు.
ఇందిరాగాంధీ దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాల అభ్యున్నతికి రోటీ, కపడ, మకాన్ విధానాలతో దేశాభివృద్ధిలో తన ముద్ర వేశారన్నారు. పీవీ, మన్మోహన్ సింగ్ వంటి వారు ఆర్థిక సంస్కరణల అమలుతో తమ బ్రాండ్ చాటుకున్నారన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయన్నారు. ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారని..రూ.2 కిలో బియ్యం బ్రాండ్ గా ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారన్నారు. హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారన్నారు. జలయజ్యం, ఉచిత విద్యుత్తులతో రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్సార్ ను గుర్తుంచుకుంటారన్నారు.
“యంగ్ ఇండియా” నా బ్రాండ్
అభివృద్ధి పురోగమనంలో ఇవాళ నేను క్రియేట్ చేసిన నా బ్రాండ్ “యంగ్ ఇండియా” అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని..అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది మా బ్రాండ్ అని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీలను నేను ఏర్పాటు చేస్తున్నానన్నారు. 140కోట్ల భారత్ దేశం ఒలంపిక్ గోల్డ్ మెడల్ అందుకోలేక పోతుందన్నారు. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని, ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నామని తెలిపారు. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని గుర్తు చేశారు.
ఆదర్శనీయంగా పోలీస్ స్కూల్
ఈ రోజు ప్రారంభించుకున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని గుర్తు చేశారు. సైనిక్ స్కూల్ కు ధీటుగా పోలీస్ స్కూల్ ను తీర్చి దిద్దాలన్నారు. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలి పోలీస్ స్కూల్ కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.