Site icon vidhaatha

Southwest Monsoon | ఏపీలోకి ప్రవేశించిన నైరుతి.. రెండ్రోజుల్లో తెలంగాణకు విస్తరణ

Southwest Monsoon

విధాత: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ఆదివారం తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ తదితర ప్రాంతాలపై విస్తరించినట్లు తెలిపింది.

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రాగల 24 గంటల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

అయితే.. రాష్ట్రం మొత్తానికీ విస్తరించే వరకూ ఎండలు కొనసాగుతాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, గోవా, కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలకు, తమిళనాడులోని అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ తెలిపింది.

రానున్న 48 గంటల్లో పశ్చిమబెంగాల్‌, సిక్కిం, బీహార్‌కు విస్తరించే అవకాశం ఉన్నదని వెల్లడించింది. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ తీర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొన్నది.

Exit mobile version