- తన భర్తతో ఉన్న ఫోటోలను ఫేక్ తంబ్ నైల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
- యూట్యూబ్ చానల్స్, వెబ్ సైట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకోలు
- సెలబ్రిటీలు చనిపోయారనే దుష్ప్రచారంపై ఆగ్రహం
విధాత: యూట్యూబ్ చానల్స్(YouTube channels)పై సినీ నటి హేమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేసి అసత్య ప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పలు యూట్యూబ్ చానల్స్, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం సైబర్ క్రైమ్ (cyber crime) పోలీస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సినిమా ఇండస్ట్రీకు చెందిన సెలబ్రెటీల పై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారన్నారు. మూడేళ్ళ క్రితం తన వెడ్డింగ్ యానవర్సరీ వీడియోను ఇప్పుడు మరోసారి పోస్ట్ చేసి తప్పుడు తంబ్ నైల్స్ పెడుతున్నారని అన్నారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు బ్రతికి ఉండగా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో ఇలాంటి వేధింపులు అధికమవుతున్నాయన్నారు. ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్ పై సైబర్ క్రైమ్స్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏసీపీని కోరుతున్నానన్నారు. ఈ కేసులో కోర్టుకు వెళ్లేందుకు కూడా తాను వెనుకాడనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.