Sri Rama Navami | వైభవంగా భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవం

శ్రీరామ నవమి వేడుకలను బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఊరూరా రామాలయాలు సీతారాముల పెళ్లి వేడుకల శోభతో కళకళలాడాయి

  • Publish Date - April 17, 2024 / 03:57 PM IST

ఊరూర రాములోరి పెళ్లి సందడి

విధాత : శ్రీరామ నవమి వేడుకలను బుధవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఊరూరా రామాలయాలు సీతారాముల పెళ్లి వేడుకల శోభతో కళకళలాడాయి. తెలంగాణలోని సుప్రసిద్ద భద్రాచల రామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన మిథిలా మైదానంలో రాములోరి కల్యాణ వేడుకను శాస్త్రయుక్తంగా ఉదయం 10.30నుంచి 12.30వరకు ఘనంగా నిర్వహించారు.

భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్ లగ్నంలో కల్యాణ క్రతువును వేదపండితుల మంత్రోచ్చరణలతో.. వధువరుల విశేష సుగుణుల ప్రవరతో.. వివాహా ఘట్టంలోని విశేషాల వివరణల మధ్య ఆధ్యంతం ఆసక్తికరంగా నిర్వహించారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితురాయి, రామమాడ తదితర ఆభరణాలను రామయ్యకు, సీతమ్మకు, లక్ష్మణ స్వామికి ధరింపజేశారు.

అర్చక స్వాములు స్వామి వారికి నూతన వస్త్రాలను అలంకరించారు. అభిజిత్‌ లగ్నం సమయంలో సీతారాముల ఉత్సవమూర్తుల శిరస్సుపై జీలకర్రబెల్లం ఉంచి.. అనంతరం భక్తరామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణ వేడుకను తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు వీక్షించి పరవశించి పోయారు. భద్రాచలం పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి.

తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా పట్టు వస్త్రాలు, ముత్యాల తాలంబ్రాలను భద్రాద్రి రామయ్య కల్యాణానికి పంపడం విశేషం. కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ పీఎస్‌ నరసింహా, హైకోర్టు జడ్జి భీమపాక నగేష్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, ఫ్యాన్లు, కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. సుమారు రెండు వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తును పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టాభిషేక కార్యక్రమం జరుగనున్నది.

Latest News