Anti BJP Alliance । పొత్తులు లోక్‌సభ ఎన్నికలకు ముందా? తర్వాతా?

బీజేపీ ఓటమే ఏకసూత్ర అజెండా కావాలన్న స్టాలిన్‌ విపక్షాల ఐక్యత కోసం స్టాలిన్‌ ప్రతిపాదన ఫలించేనా? కాంగ్రెస్‌ను కలుపుకొని పోకుండా కూటమి నిర్మాణం సాధ్యమా? ఎన్నికల తర్వాత పొత్తు ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయా? మమతా, కేసీఆర్‌, కేజ్రీవాల్‌ యత్నాలను వృథా అని అని పరోక్షంగా చెప్పిన తమిళ సీఎం Anti BJP Alliance । కీలకమైన ’ఎన్నికల’ యుద్ధంలో కత్తులు దూసుకుని.. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ‘కలిసొచ్చే’ శక్తులతో కూటమి ఏర్పాటు చేయడమా? లేక ముందే కూటమిని […]

  • Publish Date - March 6, 2023 / 10:30 AM IST

  • బీజేపీ ఓటమే ఏకసూత్ర అజెండా కావాలన్న స్టాలిన్‌
  • విపక్షాల ఐక్యత కోసం స్టాలిన్‌ ప్రతిపాదన ఫలించేనా?
  • కాంగ్రెస్‌ను కలుపుకొని పోకుండా కూటమి నిర్మాణం సాధ్యమా?
  • ఎన్నికల తర్వాత పొత్తు ప్రయత్నాలు ఫలితాన్నిస్తాయా?
  • మమతా, కేసీఆర్‌, కేజ్రీవాల్‌ యత్నాలను వృథా అని అని పరోక్షంగా చెప్పిన తమిళ సీఎం

Anti BJP Alliance । కీలకమైన ’ఎన్నికల’ యుద్ధంలో కత్తులు దూసుకుని.. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ‘కలిసొచ్చే’ శక్తులతో కూటమి ఏర్పాటు చేయడమా? లేక ముందే కూటమిని ఏర్పాటు చేసుకుని ఏకైక ప్రత్యర్థి బీజేపీని ఓడించేందుకు కృషి చేయడమా? ఈ అంశంపైనే విపక్ష శిబిరం రెండుగా చీలిపోయినట్టు ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో బీజేపీ ఓటమే ఏక సూత్రంగా విపక్షాలు పని చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఇచ్చిన పిలుపు వాస్తవరూపం దాల్చుతుందా?

విధాత: ఇటీవల జరిగిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ (MK Stalin)70వ జన్మదిన వేడుకల్లో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వేడుకకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), మాజీ సీఎంలు ఫరూఖ్‌ అబ్దుల్లా (Farooq Abdullah), అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav)లతో పాటు బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav)తదితరులు హాజరయ్యారు.

ఈ వేదిక ద్వారా విపక్షాలు తమ ఐక్యతారాగాన్ని వినిపించాయి. కాంగ్రెస్‌ పార్టీ లేకుండా బీజేపీ యేతర కూటమి సాధ్యం కాదని మొదటి నుంచీ చెబుతున్న నేతల్లో స్టాలిన్‌ ఒకరు. ఇదే వేదికపై జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా ప్రధానిగా స్టాలిన్‌ అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. స్టాలిన్‌ జాతీయస్థాయిలో ప్రముఖ స్థానానికి ఎదగాలని అఖిలేశ్‌ ఆకాంక్షిస్తున్నట్టు మాట్లాడారు.

బీజేపీకి ప్రస్తుతం కర్త, కర్మ, క్రియ.. అన్నీ నరేంద్ర మోదీ()Narendra Modi)నే అన్నట్టు ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఆయన పేరునే ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోడీకి ప్రత్యామ్నాయ నేతగా (Alternative to Narendra Modi) ప్రస్తుతానికి విపక్ష పార్టీల్లో అందరూ అంగీకరించే నాయకుడు ఎవరూ లేకపోవడం బీజేపీకి బలమైన అంశంగా మారిందని చెబుతున్నారు.

కానీ తన 70 వ పుట్టిన రోజు వేడుక సందర్భంగా స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీని కట్టడి చేయాలంటే ప్రస్తుతం విపక్ష పార్టీలు తప్పనిసరిగా ఆలోచించి దీనిపై ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. కాంగ్రెస్‌ను కలుపుకొని పోకుండా బీజేపీపై పోరాటం చేయాలని కొన్ని పార్టీలు చేస్తున్నసూచనలను ఆయన తోసి పుచ్చారు. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (KCR), పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)వంటి నేతలను ఉద్దేశించినవేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురు నేతలే కాంగ్రెస్‌, బీజేపీ యేతర కూటమి కోసం కొంతకాలంగా యత్నిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే కాంగ్రెస్‌ లేకుండా ప్రతిపక్ష కూటమి నిర్మాణం, ఎన్నికల అనంతరం పొత్తుల గురించి ఆలోచించాలనడం నిష్ప్రయోజక ప్రతిపాదనలని స్టాలిన్‌ అభివర్ణించడం గమనార్హం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో (2024 General Elections) ఎవరు అధికారంలోకి రావాలి అనేదాని కంటే ఎవరు రాకూడదు అనేదే ప్రధానమని కుండబద్దలు కొట్టారు. దేశాన్ని మతపరంగా విభజిస్తున్న ఫాసిస్టు శక్తులను రాజకీయంగా ఓడించాలన్న ఏకసూత్రం పై విపక్షాలు ఏకమవ్వాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

స్టాలిన్‌ మాటల ఆంతర్యాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్‌ను పక్కనపెట్టి బీజేపీపై చేసే పోరాటం వృథా అని, పైగా ఆ ప్రయత్నాల వల్ల బీజేపీకే మేలు జరుగుతున్నదని ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. కాబట్టి ఎన్నికలకు ముందు విడిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత పొత్తుల గురించి ఆలోచించడానికి ఏమీ ఉండదు అని స్టాలిన్‌ స్పష్టంచేశారు. విపక్షాలు ఒక్కతాటిపైకి రాకపోతే ఏం జరుగుతుందో చెప్పనవసరం లేదని బీహార్‌ సీఎం కూడా నితీశ్‌ ఇటీవల చెప్పడం గమనార్హం.

ఎందుకంటే చాలా పెద్ద రాష్ట్రాల్లో అంటే దాదాపు 180 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ముఖాముఖిగా తలపడనున్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ యేతర కూటమి పేరుతో కొన్ని పార్టీలు చేసే ప్రయత్నాలు అంతిమంగా బీజేపీకే మేలు చేస్తాయి. అప్పుడు ఇక ఎన్నికల తర్వాత కూటమి (Alliance After Elections)ఏర్పాటునకు ఆస్కారమే ఉండదని నితీశ్‌, తాజాగా స్టాలిన్‌ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతున్నది.

బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం పెరిగిపోయింది, ధరల పెరుగుదలను అరికట్టలేకపోతున్నది, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నది, ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలే కాదు ప్రజల్లోనూ ఆగ్రహం ఉన్నది. కానీ విపక్షాల్లో విభేదాల వల్ల ఆ వ్యతిరేకతను అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుని ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నది.

అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే ఆ పార్టీని గద్దె దింపడమే ఏకైక అజెండాగా ప్రతిపక్షాలన్నీ ఐక్యం (Unity of Opposition Parties)కావాలని తమిళనాడు సీఎం చేసిన ప్రతిపాదనను విపక్షాలు ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయా? 2004లో వాజపేయి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి స్టాలిన్‌ తండ్రి కరుణానిధి ప్రతిపక్షాలను ఏకం చేశారు. ఆ పనికి ఇప్పడు స్టాలిన్‌ పునుకొంటారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది.

Latest News