ర్యాంకర్ల ఫ్యాక్టరీలో మరో విద్యార్థి సూసైడ్‌

ర్యాంకర్ల ఫ్యాక్టరీగా పేర్గాంచిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యాకుసుమం ఒత్తిడిని తట్టుకోలేక రాలిపోయింది. ‘పాపా.. నా వల్ల కావడం లేదు. జేఈఈ పాస్‌ అవ్వలేను

  • Publish Date - March 8, 2024 / 03:47 PM IST

కోటా: ర్యాంకర్ల ఫ్యాక్టరీగా పేర్గాంచిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యాకుసుమం ఒత్తిడిని తట్టుకోలేక రాలిపోయింది. ‘పాపా.. నా వల్ల కావడం లేదు. జేఈఈ పాస్‌ అవ్వలేను. ఈ విషయం నీకు చెప్పే ధైర్యం లేదు. అందుకే వెళ్లిపోతున్నా.. అంటూ ఆత్మహత్య లేఖ రాసి.. ఒక విద్యార్థి చనిపోయాడు. జేఈఈ చేయలేని అశక్తతకు తండ్రి తిడతారనే భయం.. ఆ విద్యార్థిని తీవ్ర నిర్ణయానికి పురిగొల్పింది. ఈ ఏడాది కోటాలో ఇది ఆరవ ఆత్మహత్య కావడం ఆందోళన కలిగిస్తున్నది. శుక్రవారం అభిషేక్‌ సింగ్‌ అనే 16ఏళ్ల విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునిది బీహార్‌లోని భాగల్పూర్‌. గత ఏడాది నుంచి కోటాలో జేఈఈ శిక్షణ పొందుతున్నాడు. అతడి గదిలో ఆత్మహత్య లేఖ లభించిందని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం అభిషేక్‌ బయట కనిపించాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. నెల రోజుల నుంచి విజ్ఞాన్‌ నగర్‌లోని ఒక పీజీ హాస్టల్‌లో అభిషేక్‌ ఉంటున్నాడని డీఎస్పీ ధరమ్‌వీర్‌ సింగ్‌ తెలిపారు. గత రెండు పరీక్షలకు హాజరుకాలేదని చెప్పారు. అభిషేక్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించామని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.