Suprime Court | రాజకీయాలతో మతాన్ని కలుపొద్దు.. విద్వేష వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్

విధాత‌: విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాల పట్ల సుప్రీంకోర్టు (Suprime Court) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మతాన్ని రాజకీయాలతో కలుపవద్దని, నాయకులు రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవద్దని అప్పుడే వక్రబుద్ది గల మూకల విద్వేష వ్యాఖ్యలు నిలిచి పోతాయని కోర్టు అభిప్రాయ పడింది. ఎంత మందిపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టగలం? ప్రజలే ఇతర వర్గాల వారిపై దుర్భాషలు ఆడకుండా ప్రతిన బూనాలి అని న్యాయమూర్తులు కె.ఎం. జోసెఫ్, బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రధానులు […]

  • Publish Date - March 29, 2023 / 01:44 PM IST

విధాత‌: విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాల పట్ల సుప్రీంకోర్టు (Suprime Court) తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మతాన్ని రాజకీయాలతో కలుపవద్దని, నాయకులు రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవద్దని అప్పుడే వక్రబుద్ది గల మూకల విద్వేష వ్యాఖ్యలు నిలిచి పోతాయని కోర్టు అభిప్రాయ పడింది.

ఎంత మందిపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టగలం? ప్రజలే ఇతర వర్గాల వారిపై దుర్భాషలు ఆడకుండా ప్రతిన బూనాలి అని న్యాయమూర్తులు కె.ఎం. జోసెఫ్, బి.వి. నాగరత్నతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, వాజపేయి ప్రసంగాలు వినడానికి ప్రజలు తరలి వచ్చేవారని ధర్మాసనం గుర్తు చేసింది.

పెడ బుద్ధి గలవారు ప్రతి రోజు టీవీలలో, ఇతర వేదికలపై విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని ప్రస్తావించింది. మత సామరస్యం నెలకొనాలనుకుంటే, విద్వేష ప్రసంగాలు ఉండకూడదని కోర్టు పేర్కొన్నది.

విద్వేష వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదులు నమోదు చేసినంత మాత్రాన సమస్య తీరిపోదని, వారిపై చర్యలు తీసుకున్నారని కోర్టు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది. విద్వేష వ్యాఖ్యలపై విచారణ సాగిస్తూ సుప్రీం కోర్టు గత అక్టోబర్ 21న ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరా ఖండ్ రాష్ట్రాలకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

విద్వేష వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఫిర్యాదు కోసం ఎదురు చూడకుండా దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. చర్యలు తీసుకోవడంలో జాప్యం సాగిస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కూడా హెచ్చరించింది. రాజ్యంగం మనది లౌకిక రాజ్యమని పేర్కొన్నదని గుర్తు చేసింది.

విద్వేష వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన ఒక పిటిషన్ పై విచారణ సాగిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కొందరు సభ్యత మరిచి మాట్లాడుతున్నారని అగ్రహం వ్యక్తం చేసింది. ’పాకిస్థాన్ కు వెళ్ళిపొండి‘ అంటూ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఉదహరించింది. వారు మన సోదరీ సోదరులు, వారు ఈ దేశంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ స్థాయికి దిగజారి మాట్లాడవద్దని హితవు చెప్పారు. చిన్నప్పుడు పాఠశాలలో చేసిన ప్రతినను కూడా కోర్టు గుర్తు చేసింది