విధాత: టిడిపి మహానాడు అంటేనే ఓ సందడి.. నాయకుల ప్రసంగాలు.. ఎన్టీయార్ ఫోటో ఎగ్జిబిషన్. ఇంకా కార్యకర్తల ఆట పాటలు.. ఇవన్నీ అందులో భాగమే.. ఇది కాకుండా చంద్రబాబు ప్రసంగం.. చివర్లో ఎన్టీయార్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం సైతం రొటీన్.. ఇంకా చంద్రబాబు దృష్టిలో పడాలనే తపనతో అత్యుత్సాహం చూపించి వేదిక మీద నుంచి ఇష్టానుసారం మాట్లాడే నాయకులు.. కొత్తగా నాయకులుగా ఎదగాలనుకున్నవారూ ఉంటారు.
గత ఒంగోలు మహానాడులో రాజాం నుంచి వచ్చిన కావలి గ్రీష్మ (మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కూతురు) చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఒంగోలు సభలో వేదిక మీదకు వచ్చిన గ్రీష్మ తొడ కొట్టి… నా కొడకల్లారా అంటూ బూతులు మాట్లాడి అందర్నీ బిత్తర పోయేలా చేశారు.
ఆరోజు ఆవిడ ఏమన్నారంటే.. “ఎవడైనా సరే, జగన్‌మోహన్‌రెడ్డి అని ఇంటికొచ్చినా, బస్సు యాత్ర అని వచ్చినా, బస్సులో నుంచి ఈడ్చి ఈడ్చి తంతాం సార్. నా కొడకల్లారా రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారు. సిగ్గూశరం లేకుండా బస్సులో వెళ్తారా? బస్సులో నుంచి ఈడ్చి తన్నక పోతే (తొడ కొట్టి) తెలుగుదేశం గడ్డమీద పుట్టినోళ్లం కాదు” అని ఆవేశంతో మాట్లాడారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే గ్రీష్మ ఒక్కసారిగా అలా లైమ్ లైట్ లోకి వచ్చారు. వాస్తవానికి ఆమె రాజాం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా తాను పోటీ చేస్తున్నట్లు ఓ సారి పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటన కూడా చేశారు.
అంటే తనకు తానే టికెట్ ఖరారు చేసుకున్నారన్నారు అన్నమాట. అయితే ఆమె అవేశం.. అనాలోచిత చర్యలు.. ప్రకటనలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయని భావించిన హై కమాండ్ ఆమెను దూరం పెట్టి కంట్రోల్ చేసింది.
ఇదిలా ఉండగా రాజాం టికెట్ ఆమె తల్లికి కూడా ఇవ్వడం లేదు. కొండ్రు మురళీ మోహన్ కు దాదాపుగా ఖరారు చేసిన చంద్రబాబు ఆయన్ను ప్రజల్లో ఉండాలని చెప్పేశారు. దీంతో గ్రీష్మ కు నిరాశే ఎదురైంది. ఈసారి ఆమె మహానాడులో ఎక్కడా కనిపించలేదు.