విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు శాసన మండలిలో ఖాళీలకు కారణమయ్యాయి. వాటి కోసం కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో ఆశావహులు రేసులో ఉండబోతున్నారు. ఈ ఎన్నికల్లో బీఆరెస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్సీ పోటీ పడ్డారు. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలలో ఓటమి చెందారు. అయితే బీఆరెస్ నలుగురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. దీంతో వారి ఎమ్మెల్సీ స్థానాలతో పాటు గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీలు కలుపుకుని ఆరు ఎమ్మెల్సీలు భర్తీ చేయాల్సివుంటుంది.
హుజూరాబాద్ నుంచి గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ పదవి, కల్వకుర్తి నుంచి గెలిచిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, స్టేషన్ ఘనపూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఎమ్మెల్సీ, జనగామ నుంచి గెలిచిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాబోతున్నాయి. పల్లాకు 2027 మార్చి వరకు పదవీ కాలం ఉంది. ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కావడంతో వారి పదవులు కాంగ్రెస్ నేతలతో భర్తీ చేసుకునే వీలు చిక్కింది. అలా కాంగ్రెస్ పార్టీలో ఓ నలుగురికి పదవులిచ్చే అవకాశం దక్కింది.
ఎంపీలుగా ఉండి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి ఎమ్మెల్యేలుగా గెలిచిన రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు, బీఆరెస్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు ఎంపీ పదవులకు రాజీనామాలు చేయాల్సివుంటుంది. అయితే వారి ఎంపీ పదవులకు రాజీనామాలు చేసే లోగానే పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశముండటంతో ఉప ఎన్నికలకు అవకాశం లేదు.