Telangana | విజ‌యంపై కాంగ్రెస్ ధీమా!

  • Publish Date - April 11, 2024 / 10:19 AM IST

  • 14 సీట్లు ప‌క్కాగా ఖాయమంటున్న కాంగ్రెస్‌

  • ప‌రోక్షంగా విపక్షపార్టీ స్థానిక నేత‌ల మద్దతు?

  • అంతర్గతంగా స‌ర్వే చేయించిన కాంగ్రెస్‌!

  • ఓటింగ్‌ శాతం 39.7% నుంచి 46 శాతానికి?

  • ఆరు గ్యారెంటీల అమలుపై ప్రజల్లో నమ్మకం!

  • రాజకీయ వాతావరణం కలిసొస్తుందన్న నేతలు

  • ఎమ్మెల్యేల వలసలతో బీఆరెస్‌లో నైరాశ్యం

  • మోదీ మేనియా గట్టెక్కిస్తుందని బీజేపీ ఆశ

  • ఆశలు నెరవేరే చాన్స్‌ లేదంటున్న పరిశీలకులు

  • బీఆరెస్‌ను ముంచనున్న అవినీతి ఆరోపణలు?

 

విధాత‌: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే అంశంపై క్షేత్రస్థాయిలో, రాజకీయ పరిశీలకుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే.. ఈ ఎన్నికల్లో తాము ఘన విజయం సాదిస్తామని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 14 సీట్లలో పక్కాగా గెలుస్తామని నాయ‌కులు చెపుతున్నారు. ఈ మేర‌కు పార్టీ అంత‌ర్గ‌తంగా చేయించుకున్న స‌ర్వేలో తమ విజయావకాశాలపై స్పష్టత వచ్చిందని అంటున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో కూడా గ‌ట్టి పోటీ ఇస్తామ‌ని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ బాగా పెరిగింద‌ని ఆ పార్టీ నాయకులు అంచ‌నా వేస్తున్నారు.

కాంగ్రెస్ ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లులోకి తీసుకు వ‌స్తున్నామ‌ని, ఇది త‌మకు సానుకూల అంశంగా మారింద‌ని చెపుతున్నారు. ముఖ్యంగా మ‌హిళా శ‌క్తి ప‌థ‌కం కింద ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, 500ల‌కు గ్యాస్ సిలిండ‌ర్‌, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని ప్రస్తావిస్తున్నారు. మిగ‌తా ప‌థ‌కాలు కూడా ప‌క్కాగా అమ‌లు చేస్తామ‌న్న విశ్వాసం ప్ర‌జ‌ల్లో క‌లిగింద‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం కూడా త‌మ‌కు క‌లిసి వ‌చ్చే విధంగా ఉంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బీఆరెస్‌పై ఆరోపణలు కలిసొచ్చే అంశం!

గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల విషయంలో బీఆరెస్ పెద్ద ఎత్తున అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటుంద‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. కాళేశ్వ‌రం, ధ‌ర‌ణి, ఫోన్ ట్యాపింగ్‌, విద్యుత్తు కొనుగోళ్లలో జ‌రిగిన అక్ర‌మాల‌కు బీఆరెస్ నేత‌లే కార‌ణ‌మ‌న్న అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంద‌ని, ఇదంతా త‌మ‌కు క‌లిసి వ‌చ్చే అంశ‌మ‌ని చెబుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఎమ్మెల్సీ క‌విత లిక్క‌ర్ స్కామ్ బీఆరెస్‌ను మ‌రింత కుంగ‌దీసిందంటున్నారు.

మ‌రో వైపు బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళుతున్నార‌న్న ప్ర‌చారం ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంది. ఇప్ప‌టికే సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీ‌హ‌రి బీఆరెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేంద‌ర్ సికింద్రాబాద్ ఎంపీగా కూడా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండ‌గా, క‌డియం శ్రీ‌హ‌రి త‌న కూతురు కావ్య‌కు వ‌రంగ‌ల్ టికెట్ ఇప్పించుకున్నారు.

ఇది ఇలా ఉండ‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి త‌న స‌తీమ‌ణితో క‌లిసి కాంగ్రెస్‌లో చేరి మ‌ల్కాజిగిరి టికెట్ ఇప్పించుకున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. అలాగే సీనియ‌ర్ నేత కేకే, త‌న కూతురు గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మితో క‌లిసి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఇలా ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల నేత‌లు కాంగ్రెస్‌లో చేర‌గా, అనేక మంది కింది స్థాయి కేడ‌ర్ త‌మ‌కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇస్తున్నార‌న్న ధీమా కాంగ్రెస్ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే బీఆరెస్‌ నుంచి ఉన్నా.. గెలుపు మాదే

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆరెస్ గెలిచిన చోట ఉన్న పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌లో సైతం తాము గెలుస్తామ‌ని కాంగ్రెస్‌ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి, ఇప్ప‌టికీ ఓటింగ్ శాతం బీఆరెస్‌కు బాగా త‌గ్గిన‌ట్లు త‌మ అంత‌ర్గ‌త స‌ర్వేలో తేలిందంటున్నారు. మ‌రోవైపు రాష్ట్రంలో మైనార్టీల ఓట్లు ఈ ఎన్నిక‌ల్లో గంప‌గుత్త‌గా కాంగ్రెస్‌కు ప‌డే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఎంఐఎం నేత‌లు కాంగ్రెస్‌తో ర‌హ‌స్య అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్లు ప్రచారం జరుగుతున్నది.

బీజేపీకి వచ్చేదేమీ లేదు.. పోయేవే..!

రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఏమీ పెర‌గ‌లేద‌ని, పైగా ఉన్న‌దాంట్లో రెండు, మూడుసీట్లు కోల్పోయే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ కూడా రాజకీయ వర్గాల్లో జ‌రుగుతోంది. మోదీ మేనియా తెలంగాణ‌లో ప‌ని చేయ‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ముఖ్యంగా లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత అరెస్ట్‌పై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాంటున్నారు. కేవ‌లం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయ‌డం కోసమే కవితను అరెస్టు చేశారని అంటున్నారు. ఇప్ప‌టికీ బీజేపీకి బీఆరెస్‌తో అంత‌ర్గ‌త సంబంధాలున్నాయ‌న్న ప్ర‌చారం కూడా ఉంది. ఇది కూడా బీజేపీ, బీఆరెస్‌ల‌కు మైన‌స్ పాయింట్‌గా ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఆ మూడింటిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ!

కాంగ్రెస్ పార్టీ మ‌రో మూడు స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను నిర్ణ‌యించాల్సి ఉంది. ఈ మూడింటిపై ఒక‌టి రెండు రోజుల్లో క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ నాయ‌కుడొక‌రు అన్నారు. ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గానికి పొంగులేటి వియ్యంకుడు రామ‌స‌హాయం సురేంద‌ర్‌రెడ్డి కుమారుడు ర‌ఘురామిరెడ్డికి దాదాపుగా ఫైన‌ల్ అయిన‌ట్లేన‌న్న చ‌ర్చ జరుగుతోంది. అలాగే క‌రీంన‌గ‌ర్‌కు ప్ర‌వీణ్ కుమార్‌రెడ్డి, రాజేంద‌ర్‌రావుల మ‌ధ్య తీవ్ర‌పోటీ నెల‌కొన్న‌ద‌ని, హైద‌రాబాద్‌కు డీసీసీ అధ్యక్షుడు స‌మీరుల్లా పేరు దాదాపు ఖ‌రారు అయిన‌ట్లేనని తెలుస్తోంది. ఒక‌టి రెండు రోజుల్లో ఈ స్థానాల‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెపుతున్నారు.

Latest News