విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేది ఎవరో ఆదివారం తేలనుంది. ఈవీఎంలలో భద్రంగా నిర్లిప్తమైన ఓట్లను జిల్లాలో కేటాయించిన లెక్కింపు కేంద్రాల్లో లెక్కించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పటిష్ట భద్రత మధ్య ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను ఉంచారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఉండే ఆయా పార్టీల కార్యకర్తలకు ఏజెంట్ పాస్ లను అధికారులు అందించారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, అంతలోపే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
గెలుపు ధీమాలో అభ్యర్థులు
మహబూబ్ నగర్: ఈ నియోజకవర్గంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని తెలుస్తోంది. రెండు మండలాలు, పాలమూరు పట్టణం ఈనియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కాంగ్రెస్ వైపే ఓటర్లు మొగ్గు చూపారనే విషయం బయటపడుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాత్రం గెలుపు తమదే అనే ధీమా వ్యక్తం చేశారు.
ఈనియోజకవర్గంలో మైనారిటీ, బీసీల ఓట్లు గణనీయంగా ఉండడం.. అందులో అధిక శాతం కాంగ్రెస్ వైపే ఉన్నట్లు సర్వేలు చెపుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ప్రకటిస్తున్నారు. ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపి పాలమూరులో అరాచక పాలనకు స్వస్తి చెప్తారని ఎన్నం అంటున్నారు.
నారాయణ పేట: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డి గెలుపు తథ్యమనే ధోరణిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి అహంకారమే కాంగ్రెస్ కు కలిసివచ్చిందన్న చర్చ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇదే విషయంపై ప్రచారంలో రాజేందర్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించి సక్సెస్ అయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 20 వేలపైగా మెజారిటీతో పర్ణిక గెలుస్తుందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు.
మక్తల్: ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి గెలుపు బాటలో ఉన్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను శ్రీహరి ఉపయోగించుకుని ఓటర్లను ఆకట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రామ్మోహన్ రెడ్డి అహంకారం కూడా ఓటమికి కారణాలు కావచ్చని అభిప్రాయపడుతున్నారు.
దేవరకద్ర: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లు ఉంది. బీఆర్ ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. స్వల్ప మెజారిటీతో బయటపడతాననే ఉద్దేశంలో ఆల ఉన్నారు. అధిక మెజారిటీతో తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కే గెలిచే చాన్స్ ఉందని ఆపార్టీ నేతలు ధీమాలో ఉన్నారు.
జడ్చర్ల: ఉద్యమ నేత, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డికి ప్రజల మద్దతు లభించిందని, ఇక గెలుపు సులువుగానే ఉంటుందనే ధీమాలో ఆ పార్టీ శ్రేణులు ఉన్నారు. సర్వేలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసాయి. కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి కూడా తన గెలుపుపై ధీమాలో ఉన్నారు. ఎన్నికలకు ముందు గ్రామాల్లో చేసిన పాదయాత్ర కలిసి వచ్చిందనే ధోరణిలో ఆయన ఉన్నారు. లక్ష్మా రెడ్డి మాత్రం గెలుపు తమదే అంటున్నారు.
నాగర్ కర్నూల్: బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఓటమి తప్పదనే విషయం స్పష్టంగా తెలుస్తున్నదని ఇక్కడి సర్వేలు చెపుతున్నాయి. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుల్లా రాజేష్ రెడ్డి విజయం ముంగిట ఉన్నారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. తన తండ్రి కూచుకుల్లా దామోదర్ రెడ్డి మంచితనం ఓటర్లపై ప్రభావం చూపిందని, అందుకే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు దృష్టి పెట్టారనే విషయం స్పష్టమైంది. మర్రి జనార్దన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలు పట్టించుకోలేదు. ఆయన అహంకారం మాత్రమే ప్రజలు చూసి కాంగ్రెస్ వైపు మళ్ళీ చూశారనే మాటలు వినిపిస్తున్నాయి.
అచ్చంపేట: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబెట్టారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు విజయం వరిస్తుందని ఇక్కడి ప్రజలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు వ్యవహారం ఇక్కడి ప్రజలను ఇబ్బంది పడే విధంగా మారింది. ఆయన కోపిష్టి తనం ఓటమికి కారణం అవుతుందనే విషయం ఇది వరకే ప్రతిఒక్కరి మాట. గువ్వల మళ్ళీ గెలిస్తే అచ్చంపేట మరో పాతబస్తీ అవుతున్నదనే అభిప్రాయంతో ఇక్కడి ప్రజలు ఆయనను సాగనంపేందుకు కాంగ్రెస్ వైపు వెళ్ళారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వనపర్తి: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా ఓటమి తప్పదనే మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేఘా రెడ్డి వైపే ఓటర్లు మొగ్గుచూపారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని సర్వేలు చెపుతున్నాయి. నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధి వైపు ప్రజలు చూడలేదని, ఆయన అహంకారం మాత్రమే ప్రజలు చూసి కాంగ్రెస్ వైపు చూపు నిలబెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి.
గద్వాల: ఈ నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ వైపు నిలబడ్డారనే వాదన వినిపిస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి సరిత ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోలేదనే భావన ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోయి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారనే విషయం తెలుస్తోంది.
అలంపూర్: మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే మాటలు వినిపించాయి. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయ్ రాజకీయాలకు కొత్త వ్యక్తి అయినా, ఆయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డికి ఉన్న ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారు. సిటింగ్ ఎమ్మెల్యే అబ్రహంను పక్కన పెట్టి విజయ్ కు టికెట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ కు భారీగా మద్దతు లభించింది. ఇదే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు బాటలు వేశాయని ఈ ప్రాంత వాసులు అంటున్నారు.
కొల్లాపూర్: ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ బీరం హర్ష వర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే విధంగా విజయం ఉంది. ఇద్దరు మాత్రం ఎవరి గెలుపుపై వారు ధీమాగా ఉన్నారు. ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపు ఎక్కువగా మొగ్గుచూపారనే విషయం సర్వేలు చెపుతున్నాయి.
కల్వకుర్తి: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆపార్టీ నేతలు అంటున్నారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపు బాటలో ఉన్నారని అందరి నోటి మాట. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఓటమి తప్పదనే విషయం ముందుగానే పసిగట్టారనే మాటలు ఈ నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. ఇక్కడి బీజేపీ అభ్యర్థి ఆచారి కూడా గట్టి పోటీ ఇచ్చారని తెలుస్తోంది. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు పయనించారని విశ్లేషకులు అంటున్నారు.
షాద్ నగర్: ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ గెలుపు తథ్యమనే విషయం ఇప్పటికే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడా తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారనే విషయం తెలుస్తోంది
కొడంగల్: ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తున్నారని అన్ని సర్వేలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఘోరంగా ఓటమి చెందుతున్నారని ఇక్కడి ప్రజలు అంటున్నారు. 2018లో నరేందర్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డిని ఓడించి తప్పుచేశామనే భావనలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశంతో ప్రజలు ఆయనకే పట్టం కట్టారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.