Site icon vidhaatha

Subsidy Gas | సబ్సిడీ సిలిండర్‌ పథకం పూర్తి స్థాయిలో ఇంకెప్పుడు?

Subsidy Gas |  తమను గెలిపిస్తే అభయ హస్తం కింద ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికు ముందు అట్టహాసం చేసింది. నమ్మిన జనం.. ఆ పార్టీకి ఓటేసి.. అధికారం అప్పగించారు. కానీ.. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో రెండు పథకాలు మాత్రమే అమలవుతున్నాయి. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రెండోది రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌. మరో పథకం ఎల్పీజీ సిలిండర్‌కు 500 సబ్సిడీ.. పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. సబ్సిడీకి తెల్ల కార్డు లింకు పెట్టడంతో సుమారు ఆరు లక్షల పేద కుటుంబాలు సబ్సిడీ పొందలేక పోతున్నాయి. తెల్ల రేషన్‌ కార్డులు త్వరలో ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరు నెలలుగా ఊరిస్తున్నా.. అది ఆచరణలోకి రావడం లేదు.

తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరి 27న రూ.500 ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని ప్రారంభించింది. ప్రజా పాలనలో భాగంగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి 6వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. ప్రతి రీఫిల్లింగ్ సిలిండర్ పై రూ.500 సబ్సిడీ సంబంధిత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తే.. దానిని వారు వినియోగదారుల ఖాతాలోకి జమ చేస్తారని ప్రకటించారు. ఈ పథకం అమలుకు పౌర సరఫరాల శాఖ 2025 ఫిబ్రవరి నెలలో జీవో జారీ చేసింది. ఎల్పీజీ కనెక్షన్ మూడు సంవత్సరాల నుంచి కలిగి ఉండాలని, తెలుపు రంగు రేషన్ కార్డు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) ఉన్నవారు మాత్రమే అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజా పాలనలో భాగంగా అభయ హస్తం ఆరు గ్యారెంటీల కింద 1.22 కోట్ల దరఖస్తులు ప్రభుత్వానికి అందాయి. ఇందులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే ఎల్పీజీ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లకు అధిక సంఖ్యలో వినతులు వచ్చాయి. కొందరు దరఖాస్తు చేసుకోకపోవడంతో, ఆఖరి తేదీ అంటూ లేదని, దరఖాస్తుల స్వీకరణ నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రతి పథకానికి తెలుపు రంగు రేషన్ కార్డు నిబంధన విధించడంతో మెజారిటీ ప్రజలకు ఈ కార్డులు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ధకాలంలో ఒక్క కొత్త రేషన్‌ కార్డూ ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత దరఖాస్తులు స్వీకరించడంతో, కొత్తవి ఇస్తారని అందరూ సంబురపడ్డారు. పేపర్ కార్డుల స్థానంలో డిజిటల్ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఈ ఏడాది ప్రారంభంలో టెండర్లు కూడా ఆహ్వానించారు. కానీ ఇంతవరకు కాంట్రాక్టర్లను ఎంపిక చేయలేదు. ఏడాదిన్నర కాలంగా ప్రజలు కొత్త కార్డుల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. కాగా మార్పులు, చేర్పుల కింద ప్రస్తుతం ఉన్న తెలుపు రంగు కార్డులలో 20 లక్షల మందిని అదనంగా చేర్చుకుని, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 1 కోటి 20 లక్షల 39 వేల 994 ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో మిగతా రాష్ట్రాలకు చెందిన కనెక్షన్లు సుమారు ఇరవై లక్షల వరకు ఉండవచ్చని పౌర సరఫరాల అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇవి మినహాయిస్తే అటుఇటుగా ఒక కోటి మంది వరకు ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు. ఇందులో 43 లక్షల మంది ఎల్పీజీ కనెక్షన్లకు మాత్రమే సబ్సిడీ అందుతున్నది. మిగతావారు ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే తెలుపు రంగు రేషన్ కార్డును కలిగి ఉండాలి. దీంతో పలువురు కొత్త కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రజా పాలనలో అందిన దరఖాస్తులను పరిశీలించి దారిద్ర్యరేఖకు దిగువన 6.68 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ఇంటింటికి తిరిగి విచారణ చేసి నిర్ధారించారు. హైదరాబాద్ నగరం నుంచి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకోగా, వనపర్తి నుంచి స్వల్పంగా దరఖాస్తులు వచ్చాయి. కొత్తవారితో పాటు పాత వారికి స్మార్ట్ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊరిస్తున్నా.. ఒక్క స్మార్ట్ కార్డు కూడా మంజూరు చేయలేదు. దీంతో ఎల్పీజీ సబ్సిడీ కోసం ఆరు లక్షల మంది వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తే అదనంగా మరో ఆరు లక్షల మంది వరకు చేరే అవకాశముందని పౌర సరఫరాల అధికారులు చెబుతున్నారు.

Exit mobile version