Teacher Transfers | APలో నేటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు.. తెలంగాణలో ఎదురుచూపులు!

Teacher transfers అక్కడ అలా.. ఇక్కడ ఇలా!  తెలంగాణ ఉపాధ్యాయుల అంతర్మథ‌నం బదిలీలు, పదోన్నతులకు ఎదురుచూపులు! విధాత: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తుండడం తెలంగాణలోని ఉపాధ్యాయులలో అంతర్మథ‌నాన్ని రగిలిస్తుంది. పొరుగు రాష్ట్రంలో ఉపాధ్యాయ సాధారణ బదిలీలు కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం బదిలీల ప్రక్రియ పదేపదే వాయిదా పడుతున్న తీరు పట్ల ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిన ప్రభుత్వం ఈ […]

  • Publish Date - May 17, 2023 / 04:15 PM IST

Teacher transfers

  • అక్కడ అలా.. ఇక్కడ ఇలా!
  • తెలంగాణ ఉపాధ్యాయుల అంతర్మథ‌నం
  • బదిలీలు, పదోన్నతులకు ఎదురుచూపులు!

విధాత: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం నిర్వహిస్తుండడం తెలంగాణలోని ఉపాధ్యాయులలో అంతర్మథ‌నాన్ని రగిలిస్తుంది. పొరుగు రాష్ట్రంలో ఉపాధ్యాయ సాధారణ బదిలీలు కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం బదిలీల ప్రక్రియ పదేపదే వాయిదా పడుతున్న తీరు పట్ల ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వేసవి సెలవుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిన ప్రభుత్వం ఈ దిశగా ముందు నుండి కూడా ఆసక్తి చూపలేదు. బదిలీల వివాదంపై కోర్టులో నడుస్తున్న కేసు పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు నుండి చొరవ కరువైన నేపథ్యం కూడా ఉపాధ్యాయ బదిలీలకు ప్రధాన ఆటంకంగా మారింది.

2018 తర్వాత మళ్లీ ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను, పదోన్నతులను ప్రభుత్వం చేపట్టకపోవడం పట్ల ఉపాధ్యాయులలో అసంతృప్తికి కారణమవుతుంది. తమ బదిలీల పదోన్నతుల ఆకాంక్షలను, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పేరు మోసిన ఆస్థాన (అధికార పార్టీ అనుబంధ) ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు సైతం విఫలమవ్వడం ఉపాధ్యాయుల్లో అసహనాన్ని రేకెత్తిస్తుంది.

రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా 317 జీవో బదిలీలు కొన్ని, స్పౌజ్ బదిలీలు, మ్యూచువల్ బదిలీలు జరిగినప్పటికీ అవి కూడా వివాదాస్పదమయ్యాయి. ఇక ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి సర్వీస్ సీనియారిటీ, స్కూల్ కేటగిరీలలో నెలకొన్న పాయింట్ల వివాదం కోర్టులో నానుతుండటం ఉపాధ్యాయ బదిలీ, పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ వేస్తుంది.

కోర్టు కేసు పరిష్కారం అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు ఈ దిశగా సీఎం కేసీఆర్ పై తమ ప్రభావాన్ని, ప్రతాపాన్ని చూపలేకపోతున్నాయి. డిమాండ్ల సాధనకు ఆందోళన బాట పట్టి సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తేవాలని విఫలమైన పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల ఆందోళనల విఫల పర్వాలు చూసిన ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై పోరాటానికి వెనుకాడుతున్నాయి.

ఉపాధ్యాయ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలను బెదిరించుకొని సాధించుకున్న తరహాలో కేసీఆర్ ప్రభుత్వం వద్ద తమ శక్తిని ప్రదర్శించలేక పోతుండటం సగటు ఉపాధ్యాయులను తీవ్ర నిరాశకు, అసహనానికి గురిచేస్తుంది.

ఎన్నికల ఏడాదిలోనైనా ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయని, బదిలీలు, పదోన్నతులు సాధించుకుంటాయని భావించిన సగటు ఉపాధ్యాయులకు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నిరాశనే ఎదురవుతుంది. ఇప్పుడు ఏపీలో ఉపాధ్యాయ బదిలీల వ్యవహారం చూసి తెలంగాణ ఉపాధ్యాయులు తమకు బదిలీ, పదోన్నతుల భాగ్యం ఎప్పుడోనంటూ పరస్పర చర్చలు సాగిస్తూ ఎదురుచూపులు పడుతున్నారు.

జూన్ రెండో వారంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల కేసు కోర్టులో తిరిగి విచారణకు రానుండగా, ఈ దఫా విచారణ సందర్భంగానైనా ప్రభుత్వం కేసు పరిష్కారానికి చొరవ చూపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

Latest News