TelanganaAssembly Budget Sessions: తెలంగాణ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12న ప్రారంభంకానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహిస్తారు? బడ్జెట్ ఎప్పుడు ప్రవేశ పెడతారు? తదితరాలను నిర్ణయిస్తారు.
13న గవర్నర్ ప్రసంగం పై ధన్యవాదాలు తీర్మానం, 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు, 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు, సమాధానం ఉంటాయి. ఈ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్ల పెంపుపైనా చర్చించి తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యలో సమావేశాలకు స్వల్ప విరామం ప్రకటించి.. లోక్ సభ సీట్ల అంశంపై అఖిల పక్షాన్ని తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం దిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం.
హాజరుకానున్న కేసీఆర్
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మంగళవారం మధ్యహ్నం 1గంటకు సమావేశం జరగనుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని ఆయన ఇప్పటికే అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ను ఎండగడుతామని తాజాగా కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ఈ ధపా అసెంబ్లీ సమావేశాలు ఆయా అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా సాగుతాయని భావిస్తున్నారు.
