pakisthan flags: పెహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఏ స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం.. పాకిస్థాన్ కూడా డ్రోన్ల తో భారత్ మీద విరుచుకుపడటం తెలిసింది. చివరకు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. అయినప్పటికీ ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాకిస్థాన్ కు వ్యతిరేక వాతావరణం నెలకొని ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు పాకిస్థాన్ జెండాలను విక్రయిస్తుండటం.. అవి మనదేశ పౌరులకు కూడా అందుబాటులో ఉన్నట్టు కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ అయినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
పాకిస్థాన్ జెండాల విక్రయంపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈ రెండు సంస్థలకు కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ తాఖీదులు ఇచ్చింది. ఈ అంశంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సైతం స్పందించారు. ఇది చాలా సున్నితమైన అంశమని వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.