Telangana | కాషాయ నేతల చూపు.. కాంగ్రెస్‌ వైపు

Telangana విధాత: రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడి మార్పు తర్వాత ఆ పార్టీలో ఏం జరుగుతున్నది? బండి సంజయ్‌ను అర్ధారంతంగా తప్పించడంపై సొంతపార్టీ నేతల నుంచే ప్రశ్నల వర్షం కురిసింది. మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్‌ సహా కొంతమంది నేరుగా పార్టీ అధిష్ఠాన వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి కారణం బీఆర్‌ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు విశ్వసించడమే కాదు, ఇంకా పార్టీలో కొనసాగితే రాజకీయంగా తాము చాలా నష్టపోతామన్న అభిప్రాయానికి కొంతమంది […]

  • Publish Date - July 31, 2023 / 02:42 PM IST

Telangana

విధాత: రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడి మార్పు తర్వాత ఆ పార్టీలో ఏం జరుగుతున్నది? బండి సంజయ్‌ను అర్ధారంతంగా తప్పించడంపై సొంతపార్టీ నేతల నుంచే ప్రశ్నల వర్షం కురిసింది. మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్‌ సహా కొంతమంది నేరుగా పార్టీ అధిష్ఠాన వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి కారణం బీఆర్‌ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు విశ్వసించడమే కాదు, ఇంకా పార్టీలో కొనసాగితే రాజకీయంగా తాము చాలా నష్టపోతామన్న అభిప్రాయానికి కొంతమంది నేతలు వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో జరిగిన మార్పులపై బహిరంగ విమర్శలు చేయకుండా పార్టీ నేతలంతా ఐక్యంగా కలిసి పనిచేయాలని, అవకాశాలు రానివారికి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ అధిష్ఠాన పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినేలా లేరని సమాచారం.

ఇప్పటికే స్వామిగౌడ్‌, భిక్షపతిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ లాంటి వాళ్లు బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరడమే కాదు పార్టీ వైఖరిని ఎండగట్టారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి వాళ్లు విమర్శలు చేశారు. తాజాగా గిరిజన రిజర్వేషన్లపై ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలిగించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మణిపూర్‌లో రెండు తెగల మధ్య పోరు ఫలితంగా అక్కడ జరుగుతున్న పరిణమాలపై పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోగా విపక్ష పార్టీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ధ్వజమెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి అంటున్నారు. బాపూరావు వ్యాఖ్యలకు నిరససనగా సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బాపూరావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. అంతేకాదు అధికారంలోకి రాగానే లంబాడాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. అలాగే భువనగిరి బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి తనను ఎందుకు సస్పెండ్‌ చేశారో చెప్పాలని కిషన్‌రెడ్డిని డిమాండ్‌ చేస్తున్నారు. రఘునందన్‌రావు కూడా ఆ మధ్య తాను పనిచేసినా పార్టీ తన సేవలను గుర్తించడం లేదని, పార్టీ అధ్యక్ష పదవికి తాను ఎందుకు కానంటూ బహిరంగంగానే విమర్శించారు.

సహజంగా నేతలు పార్టీ మారే వరకు గుంభనంగానే వ్యవహరిస్తారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, కొంతమంది తమ ఎదుగుదలను ఓర్వలేకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీ మార్చడం అంటే చొక్కా మార్చినంత ఈజీ కాదని అంటుంటారు. అయితే ఎమ్మెల్యే రఘునందన్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్‌ తదితరులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతున్నది.

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్‌ వంటి నేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేయాలని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని బీజేపీలో చేరారు. మారిన రాజకీయ పరిణామాల పట్ల వాళ్లు అసంతృప్తితో ఉన్నారని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదరిందని వాళ్లు కూడా నమ్ముతున్నారట. అందుకే కాషాయ పార్టీకి బైబై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఏం జరుగుతున్నది? అసలు పార్టీలో ఉండేవాళ్లు ఎంతమంది? పోయేవాళ్లు ఎంత మంది అని లెక్కలు వేసుకుంటున్నారట.

కొందరు బీజేపీ నేతలు పార్టీ వీడటానికి కారణం మునుగోడులో బలమైన అభ్యర్థి బరిలోకి దిగినా పార్టీ ఓడిపోవడంతో బీజేపీ బలం స్పష్టమైంది. అప్పటి నుంచే పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఈటల రాజేందర్‌ వంటి నేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, అధికార బీఆర్‌ఎస్‌పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నవైఖరిపై కొంతమందికి మింగుడు పడలేదు. అయినా మౌనంగానే ఉన్నారు.

బండి సంజయ్‌ని తప్పించిన తర్వాత తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఇన్ని పరిణామాలు జరిగిన తర్వాత ఇంకా పార్టీలోనే కొనసాగితే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్థంగా మారుతుందని ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే కొంతమంది కాషాయ నేతలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని సమాచారం. ఎంతమంది పార్టీని వీడుతారన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.

Latest News