Site icon vidhaatha

Errabelli Dayakar Rao | ఎర్రబెల్లికి అసమ్మతి భయం

Errabelli Dayakar Rao | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆపదకాలంలో అందరికీ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజకవర్గాన్ని చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తికే పరిమితమైతున్నారు. ఆయనను అసమ్మతి భయం వెంటాడుతోంది.

మొన్నటి వరకు ఎంతో ధీమాతో ఉన్న ఎర్రబెల్లికి నియోజకవర్గంలోని అసంతృప్తులు రహస్య సమావేశం నిర్వహించి ఊహించని గట్టి షాకిచ్చారు. ఈ షాక్ నుంచి ఆయన ఇంకా కోలుకోలేక పోతున్నారు. ఈ అసమ్మతి నాయకుల నుంచి ఆయనకు తక్షణ ముప్పేమిలేనప్పటికీ కీడెంచి మేలేంచే అనుభవం ఉన్న నేత కావడంతో అవసరమైన నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన పాలకుర్తిని వీడి ఉండడం లేదని సన్నిహితులు చెబుతున్నారు.

అసమ్మతిని సంతృప్తి పరిచే పని

పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి అమెరికా వెళ్ళిన సమయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్ననాయకులు, బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు ప్రత్యేకంగా సమావేశమై తమకు గుర్తింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశలో పార్టీ మారాలనే అభిప్రాయానికి వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ రావు, కాకిరాల హరిప్రసాద్, సోమేశ్వర్ రావు, రామసహాయం కృష్ణ కిశోర్ ల పాత్ర ఉందని సమాచారం.

నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి నుంచి కంటిమీద కునుకు కరువైన ఎర్రబెల్లి అసమ్మతి నాయకులను బుజ్జగించే పనిమీద దృష్టిపెట్టారు. అసంతృప్తివాదులు చేయిదాటిపోకుండా చర్యలు ప్రారంభించారు. తనతో అయ్యే పనిని తాను చేస్తూనే అవసరమైన సందర్భంలో అధినేత కేసీఆర్ సహకారాన్ని తీసుకున్నారంటే ఎంత ముందు జాగ్రత్తవహించారో అర్ధం చేసుకోవచ్చు.

డాక్టర్ సాబ్ కు ఆరోగ్యశ్రీ చైర్మన్

మాజీ ఎమ్మెల్యే, సీనియన్ నేత డాక్టర్ సుధాకర్ రావును బుజ్జగించారు. సీఎంను ఒప్పించి ఆయనకు ఆరోగ్య శ్రీ ట్రస్టు చైర్మన్ గా నియమించడంలో సఫలమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన కాకిరాల హరిప్రసాద్, రామసహాయం కిషోర్ రెడ్డిలను శుక్రవారం సీఎం కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్ళారు. తానే దగ్గరుండి వారి ఆవేదనను చెప్పారు. సీఎం వారికి తగిన గుర్తింపు, అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి విజయానికి పాటు పడమని చెప్పారు. మరి కొందరు నాయకులు కూడా నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్నారు. వారిని మంచిగా చేసుకునే పనిలో ఎర్రబెల్లి ఉన్నారు. ఆపదకాలంలో అందుబాటులో లేకుండా ఎర్రబెల్లి సొంత నియోజకవర్గానికి పరిమితం కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version