Cono Corpus Trees: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఓ మొక్క జాతిపై చర్చ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే కోనోకార్పస్ మెుక్కలు. హరిత హారంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో హరిత హారంలో273 కోట్ల మొక్కలను నాటామని, దీనివల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7 శాతం పెరిగిందని గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ జోక్యం చేసుకుని మీరు హరిత హారంలో 200కోట్లకు పైగా మొక్కలు నాటవచ్చని.. అయితే అందులో నాటిన కోనోకార్పస్ మొక్కలు పర్యావరణానికి హానికరంగా ఉన్నాయన్నారు. కోనో కార్పస్ మొక్కలకు నీళ్లు కూడా అవసరం లేదని.. ఆ చెట్లపై కనీసం పిట్ట కూడా కూర్చోదని, అలాంటి చెట్లను తెలంగాణ వ్యాప్తంగా నాటారని.. ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ వదులుతాయని.. ప్రభుత్వం ఆ చెట్లన్నింటిని వెంటనే తొలగించాలని రిక్వెస్ట్ చేస్తున్నానన్నారు.
అసలు ఏమిటీ కోనాకార్పోస్
కోనోకార్పస్(దమన్) అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతానికి చెందిన మొక్క. ఇది ప్రధానంగా ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క. వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరుగుతుంది. అరబ్, మద్య ప్రాచ్య దేశాల్లో ఎడారి నుంచి వచ్చే దుమ్ము, ఇసుక తుపాన్లకు, వేగంగా వీచే వేడి గాలులకు అడ్డుగోడగా పనిచేస్తుందని మొదట్లో ఈ మొక్కలను విస్తృతంగా నాటారు. కాలక్రమేణ ఈ చెట్ల పెంపకంతో ఎదురవుతున్న నష్టాలను గమనించి వాటి నివారణ చర్యలు చేపట్టారు. తెలంగాణలో ఎక్కువగా పచ్చదనం..సుందరీకరణ చర్యల్లో భాగంగా విచ్చల విడిగా కోనా కార్పోస్ మొక్కలను నాటారు. రహదారుల వెంబడి, డివైడర్లలో, వెంచర్లు, కాలనీల్లో, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మున్సిపాలిటీ పట్టణాల సుందరీకరణలో భాగంగా హైదరాబాద్ ‘జీహెచ్ఎంసీ’ సహా రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో పెంచారు. మేకలు, పశువులు తినవన్న ఆలోచనతో ఈ మొక్కలు నాటేందుకు మొగ్గుచూపారు.
పర్యావరణ హానికరమే..!
అయితే కోనోకార్పస్ చెట్లు పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయని వృక్ష, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. చెట్ల పుప్పొడిని పీల్చితే శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో కొన్ని రసాయనాలు విడుదలై, శ్లేష్మం పెరిగిపోయి కఫం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ కరాచీలో ఆస్థమా పేషంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకు ఈ మొక్కలే కారణమని తేలింది. కువైట్, ఖతార్, యూఏఈ లాంటి దేశాల నర్సరీల్లో దీని పెంపకం, దిగుమతులను నియంత్రించాయి. కోనా కార్పోస్ చెట్లు భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగించడంతో పాటు భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్, తాగునీరు, డ్రైనేజీ పైపులైన్‌లకు నష్టం చేస్తున్నాయని.. గోడలు, ఇతర నిర్మాణాలు వీటి వేర్లతో దెబ్బతింటున్నాయని నిపుణులు తేల్చారు.
2022లోనే నిషేధం
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా అప్పట్లో కోనోకార్పస్‌పై విస్తృత చర్ఛ సాగింది. పర్యావరణవేత్తలు వాటిని తమ రాష్ట్రాలలో నాటవద్ధని కోరారు. తెలంగాణ, అస్సాం, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు ఈ మొక్కల పెంపకంపై నిషేధం విధించాయి. పక్షులు కూడా వాలని..క్రిమికీటకాలు కూడా ఆశించని ఈ మొక్కలను పెంచవద్ధని ఏపీ కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కోనా కార్పస్ చెట్ల పండ్లు, పూలు ఎందుకూ పనికిరావనీ, ఆఖరికి పక్షులు కూడా దీనిపై గూళ్లు పెట్టవనీ, అందం, ఆకర్షణ తప్ప ఇతర ఉపయోగాలు లేని మొక్కలు పర్యావరణానికి ఉపయోగం లేదన్నారు. ఇన్ని సమస్యలు..అభ్యంతరాల నేపథ్యంలో 2022లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హరిత వనం’ నర్సరీల్లో కోనోకార్పస్‌ను పెంచవద్దని లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పుణ్యమా అని కోనో కార్పస్ చెట్ల తొలగింపు జరిగితే కొంతలో కొంత ప్రయోజనం కానుంది.