High Court
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు
హైకోర్టు తీర్పును నిలిపివేయాలని వనమా వేసిన పిటిషన్‌ను కొట్టేసిన తెలంగాణ ధర్మాసనం
హైదరాబాద్, విధాత: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు మరోసారి హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. సుప్రీంకు వెళ్లే వరకు హైకోర్టు తీర్పును నిలిపివేయాలని వనమా వేసిన పిటిషన్ ను కొట్టేసింది.
2018 ఎలక్షన్ అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని జలగం వెంకట్రావు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ రాధారాణి ధర్మాసనం వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ జులై 25న తీర్పు ఇచ్చింది. అతడిపై అనర్హత వేటుతో పాటు రూ. 5లక్షల జరిమానా విధించింది. 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్ రావును గుర్తిసు తీర్పునిచ్చింది.
అయితే సుప్రీం కోర్టుకు వెళ్లేంత వరకు హైకోర్టు తీర్పును నిలిపివేయాలని జులై 26న వనమా వెంకటేశ్వర్ రావు మరోసారి పిటిషన్ వేశారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే తాజాగా గురువారం వనమా వెంకటేశ్వరరావు పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే జలగం హైకోర్టు తీర్పు మేరకు తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటు అసెంబ్లీ కార్యదర్శిని, ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి తీర్పు కాపీలు అందచేశారు.
తాజాగా హైకోర్టు తీర్పు నేపధ్యంలో వనమా ఎమ్మెల్యే పదవిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై వనమా భవితవ్యం ఆధారపడివుంది.