Summer sun rise: తెలంగాణలో ఎండలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. సూర్య ప్రతాపానికి జనాలు మధ్యాహ్నమైతే చాలు నీడ పట్టున ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవి ఎండల తీవ్రతకు జలాశయాలు, చెరువులు, నదుల్లో నీరు వేగంగా అడుగంటి పోతుండగా..భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలంగాణ వాసులను ఎండలతో జర జాగ్రత్త..! అంటూ హెచ్చరిస్తుంది.
గురువారం నుంచి వచ్చే ఐదు రోజులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి 18వ తేదీ వరకు వడగాలులు వీస్తాయని.. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.