Site icon vidhaatha

low pressure | బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.. ఏపీకి తుఫాను ముప్పు తప్పేనా..?

low pressure : నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడటమేగా అది తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ తుపాను బలపడిన అనంతరం ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఒకవేళ అదే జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తప్పుతుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అయితే ఏం జరగనుందనే దానిపై అల్పపీడనం ఏర్పడిన తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని తెలిపారు. బంగాళాఖాతంలో బుధవారం (మే 22న) అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

మరోవైపు ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

Exit mobile version