Singareni | ఇప్పట్లో సింగరేణి.. గుర్తింపు సంఘం ఎన్నికలు లేనట్లేనా ?

Singareni | కర్ణాటక ఫలితాల ప్రభావమా ? ఆగస్టులో ఎన్నికలు ఉంటాయని భావించిన‌ కార్మిక సంఘాలు అక్టోబర్ వరకు వాయిదా కోరిన సింగరేణి యజమాన్యం. సింగరేణి అనుకూలంగా ఆదేశాలు జారీచేసిన న్యాయస్థానం . ఆగస్టులో గుర్తింపు సంఘo ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావమా? అక్టోబర్‌లో శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం? అసెంబ్లీ ఎన్నికల అనంతరం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు? సింగరేణి గుర్తింపు ఎన్నికలపై విధాత ప్రత్యేక కథనం విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: […]

  • Publish Date - June 25, 2023 / 07:19 AM IST

Singareni |

  • కర్ణాటక ఫలితాల ప్రభావమా ?
  • ఆగస్టులో ఎన్నికలు ఉంటాయని భావించిన‌ కార్మిక సంఘాలు
  • అక్టోబర్ వరకు వాయిదా కోరిన సింగరేణి యజమాన్యం.
  • సింగరేణి అనుకూలంగా ఆదేశాలు జారీచేసిన న్యాయస్థానం .
  • ఆగస్టులో గుర్తింపు సంఘo ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావమా?
  • అక్టోబర్‌లో శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం?
  • అసెంబ్లీ ఎన్నికల అనంతరం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు?
  • సింగరేణి గుర్తింపు ఎన్నికలపై విధాత ప్రత్యేక కథనం

విధాత, ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: తెలంగాణ కొంగు బంగారం అయినా సింగరేణి (Singareni) కాలరీస్ కంపెనీకి త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయని ఆశించిన కార్మికులకు నిరాశ మిగిలింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిని ఇచ్చి ముందుకు నడిపించిన చీకటి సూర్యులు 45 రోజులపాటు తెలంగాణ స్వరాష్ట్ర కోసం సమ్మె చేసి తమ సత్తా ఢిల్లీ దాకా వినిపించిన సింగరేణి గడ్డ చైతన్యపు అడ్డాలో 6 సంవత్సరాల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల సైరన్ మోగనుందని ఆశించినప్పటికీ సింగరేణి యాజమాన్యం నాలుగు నెలల గడువు కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది.

సింగరేణి కార్మికులందరూ ఒకే తాటిపైకి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం చూపే గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడడంతో కార్మికుల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ఆందోళన గురవుతున్నారు .

25 ఏళ్ల క్రితం సింగరేణి పీకల్లోతు నష్టాల్లో ఉన్న నేపథ్యం మరోవైపు సింగరేణి కార్మికులు కార్మిక సంఘాల పిలుపుమేరకు చీటికిమాటికి సమ్మెలో పాల్గొనడంతో బొగ్గు ఉత్పత్తి విఘాతం కలిగి మరింత నష్టాల్లోకి పోతున్న సమయంలో అప్పటి సీమాంధ్ర పాలకుడు చంద్రబాబు నాయుడు సింగరేణిని నష్టాలలో నుండి గట్టెక్కించాలంటే కార్మికులు సమ్మెలకు దూరంగా ఉండాలంటే ఒకే కార్మిక సంఘానికి అధికారిక గుర్తింపు ఇవ్వాలని భావించారు .

కార్మిక సమస్యలను సింగరేణి యజమాన్యంతో చర్చించడానికి అన్ని సంఘాలతో పని లేకుండా ఒకే ఒక గుర్తింపు సంఘం, మెజార్టీ కార్మికులు ఎన్నుకున్న గుర్తింపు సంఘంతో చర్చలు చేయడానికి గాను సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. 1998లో మొదటిసారిగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్ల కాలపరిమితితో సిపిఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలుపొందినది. 2001 వ సంవత్సరంలో మళ్ళీ ఏఐటియుసి సంఘం గెలుపొందింది. 2003లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టియుసి గుర్తింపు సంఘం గెలుపొందింది.

నాలుగు సంవత్సరాల పాటు గుర్తింపు సంఘంగా కొనసాగింది .2007 లో ఏఐటియుసి గుర్తింపు సంఘంగా గెలుపొందింది . 2012లో తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో తేరాస అనుబంధ కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ లు గుర్తింపు సంఘంగా గెలుపొందినది .2017 లో రెండోసారి టీబీజీకేఎస్ యూనియన్ గుర్తింపు సంఘంగా గెలుపొందింది. రెండు సంవత్సరాల కాల పరిమితితో గెలుపొందినప్పటికీ, నాలుగు సంవత్సరాల కాల పరిమితి కోసం టిజీబీకేఎస్ కోర్టును ఆశ్రయించింది.

2019లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలు ఇప్పటివరకు నిర్వహించలేదు . సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని మిగతా కార్మిక సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి . న్యాయస్థానం సింగరేణికి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో మరోవైపు కేంద్ర కార్మిక శాఖ సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ గా శ్రీనివాసరావును నియమించింది.

10 రోజుల క్రితం హైదరాబాదులోని ఆర్ ఎల్ సి కార్యాలయంలో సింగరేణి యాజమాన్యం తో కార్మిక సంఘాల మధ్య సమావేశo జరిగింది . సింగరేణి డైరెక్టర్ పా తో కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చల్లో నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతేనే అంగీకరిస్తామని సింగరేణి యాజమాన్యం తెలియజేసిన నేపథ్యంలో అందుకు సానుకూలంగా కార్మిక సంఘాలు అంగీకరించాయి . ఈ నాలుగు సంవత్సరాల కాల పరిమితి ఒప్పందాన్ని రీజనల్ లేబర్ కమిషనర్ కు సమర్పించారు .

ఈ నెల 24వ తేదీన కార్మిక సంఘాలతో మరోసారి సమావేశం నిర్వహించి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి నాలుగు సంవత్సరాల కాల పరిమితిపై యజమాన్యం కార్మిక సంఘాలు సంతకాలు చేస్తారు. నాలుగేళ్ల కాల పరిమితి ఒప్పందం అయిన వెంటనే అదే రోజున సింగరేణిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయి.

కార్మిక సంఘాలు భావించారు. ఏఐటీయూసీ నాయకులు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఆగస్టు 3 లేదా 10వ తేదీ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు . ఈ మేరకు కార్మిక సంఘాలు సింగరేణి గనులపై గేటు మీటింగ్ సమావేశాలు నిర్వహించి కార్మికులను తమ వైపు తిప్పుకునే విధంగా ప్రచారం కూడా కొనసాగించారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులకు సమస్యలు ఏర్పడితే సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపేది. చర్చలు కొలిక్కిరాక కార్మిక సంఘాల మధ్య వైరుధ్యాలు ఏర్పడి రోజుల తరబడి సమ్మెలు జరిగేవి . అలా సింగరేణి సంస్థ ఉత్పత్తికి కొంత నష్టం జరిగినప్పటికీ కార్మికుల హక్కుల విషయంలో మాత్రం రాజీలోని పోరాటం చేసేవారు.

1998 తర్వాత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన అప్పటినుండి కార్మికుల హక్కులకు భద్రత కరువైందని చెప్పుకోవాలి . 25 ఏళ్ల కాలంలో శాశ్వత ఉద్యోగులకు స్వస్తి పలికి కాంట్రాక్టీకరణ అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్య పెరిగి శాశ్వత కార్మికుల సంఖ్య కుదింపుకు గురి అయినదని చెప్పక తప్పదు . బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యం కంటే పెరిగినప్పటికీ కార్మికుల సంఖ్య తగ్గింది.దానికి కారణం ప్రైవేటీకరణ ఔట్సోర్సింగ్ యాంత్రికరణ మూలంగా సింగరేణి పర్మినెంట్ కార్మికులకు మంగళం పాడుతూ వచ్చింది.

తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ యూనియన్ కు రెండుసార్లు సింగరేణి కార్మికులు గుర్తింపు సంఘంగా అవకాశం కల్పిస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని కార్మికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల మూలంగా తెలంగాణ ప్రాంతం బొందల గడ్డగా మారిందని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఓపెన్ కాస్ట్ గనులను తగ్గించి, భూగర్భ గనుల సంఖ్య పెంచి సింగరేణి లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పిన యూనియన్ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు.

దానికి భిన్నంగా ఓపెన్ కాస్ట్ గనులను పెంచి భూగర్భ గనులను తగ్గించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదేమనప్పటికీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు సింగరేణి సంస్థలో పర్మినెంట్ కార్మికుల సంఖ్య కుదిస్తూ టెంపరరీ ఔట్సోర్సింగ్ కార్మికుల సంఖ్యను పెంచుతూ సింగరేణిలో భవిష్యత్తు ఔట్సోర్సింగ్ కార్మికులతోనే నడిపిస్తారా ? అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .

సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ యూనియన్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించి , తదానంతరం రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీని రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడానికి టీజీబీఎస్ ప్రయత్నిస్తామని అనుకున్న నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు అక్టోబర్ వరకు వాయిదా పడ్డాయి. అక్టోబర్ వరకు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి.

సింగరేణి సంస్థ ఆదిలాబాద్ , కరీంనగర్, వరంగల్ , ఖమ్మం ఉమ్మడి జిల్లాలలో విస్తరించి ఉంది .
11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి కార్మికులు ఉన్నారు . 11 అసెంబ్లీ నియోజకవర్గాలలో సింగరేణి కార్మికుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది.

గత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుపొందింది . 2017లో సింగరేణి గుర్తింపు సంఘంగా టీజీబికేస్ విజయం సాధించి 2018 అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు బిఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో సింగరేణి కార్మికుల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు .

అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే ఒకవేళ ప్రస్తుతం గుర్తింపు సంఘం హోదాలో ఉన్న టీబీజీకేఎస్ యూనియన్ అనుకోని విధంగా ఓటమిపాలైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై దాని ప్రభావం చూపుతుందని ఆ మెరకే గుర్తింపు ఎన్నికలను సింగరేణి యజమాన్యం , టీజీబీకేఎస్ వాయిదా కోరినట్లు సమాచారం .

కర్ణాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలైనవి . పక్క రాష్ట్రంలో విజయం సాధిస్తేనే దాని ప్రభావం తెలంగాణ పై పడిన నేపథ్యంలో మరి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో సైతం ఏమైనా తేడా వస్తే ఇక్కడి దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించడానికి న్యాయస్థానాన్ని నాలుగు నెలల పాటు వాయిదా అడిగినట్లు పలువురు భావిస్తున్నారు.

ఏదైనాప్పటికీ రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో మరియు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రెండు దపాలుగా విజయం సాధించి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే కృత నిశ్చయంతో వ్యూహాలు రూపొందించుకున్నట్లు తెలుస్తుంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం కర్ణాటక ఎన్నికల్లో సాధించిన విజయంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని ఆదే ఉత్సహంతో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రచారాలు కొనసాగిస్తున్నారు .
ఏదేమైనప్పటికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి , ఏ కార్మిక సంఘానికి అధికారం ఇచ్చి ఆశీర్వదిస్తారో? వేచి చూడాల్సిందే.