బ్రిటన్‌లో పెరిగిన గో కౌగిలింత‌ల థెర‌పీ.. ఒత్తిడి దూరం చేసుకోడానికి ఫాంల‌కు క్యూ!

పెంపుడు కుక్క‌ల‌తో ఆడుకోవ‌డం, వాటితో స‌రదాగా గ‌డ‌ప‌డం వ‌ల్ల ఒత్తిడి (Anxiety) త‌గ్గుతుంద‌ని కొంద‌రు ఎప్పుడూ చెప్పే విష‌య‌మే.

  • Publish Date - December 4, 2023 / 09:51 AM IST

విధాత‌: పెంపుడు కుక్క‌ల‌తో ఆడుకోవ‌డం, వాటితో స‌రదాగా గ‌డ‌ప‌డం వ‌ల్ల ఒత్తిడి (Anxiety) త‌గ్గుతుంద‌ని కొంద‌రు ఎప్పుడూ చెప్పే విష‌య‌మే. తాజాగా ఆవుల‌ను కౌగిలించుకోవ‌డం (Cow Cuddling) వ‌ల్ల కూడా ఒత్తిడి, ఆందోళ‌న‌లు దూర‌మ‌వుతున్నాయ‌ని అంతులేని ప్ర‌శాంత‌త క‌లుగుతోంద‌ని దీనిని అనుస‌రించేవారు చెబుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ పోక‌డ పెరుగుతుండ‌గా.. బ్రిట‌న్ మ‌రింత ఎక్కువ‌గా ఈ కౌగిలింత కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది.


ఇక్క‌డి ఈస్ట్ రైడింగ్ ఆఫ్ యార్క్‌షైర్‌లో గో కౌగిలింత‌ అనేది ఒత్తిడిని వదిలించుకోవ‌డానికి ప్ర‌ధాన మార్గంగా మారిపోయింది. గ‌త తొమ్మిదేళ్లుగా ఇలాంటి సెష‌న్ల‌కు వ‌చ్చే వారి సంఖ్య బాగా పెరిగింద‌ని స్థానిక అర్రాం డంబెల్ ఫాం ప్ర‌తినిధులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు వీటిని పాల వ్యాపారం కోస‌మే పెంచేవార‌మ‌ని.. ఇప్పుడు కౌగిలింత‌ల సెష‌న్ల కోసం వాటిని ప్ర‌త్యేకంగా సిద్ధం చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.


మార్కెట్ క‌ష్టాలే ఇటు వైపు న‌డిపాయి


పెద్ద సంఖ్య‌లో ఉండే ఆవులతో బ్రిట‌న్‌లోని డెయిరీలు లాభాల‌తో న‌డిచేవి. అయితే మార్కెట్‌లో వ‌చ్చిన మార్పుల‌తో వాటిలో చాలా వ‌ర‌కు దివాలా తీశాయి. ముఖ్యంగా క‌రెంటు బిల్లులు పెర‌గ‌డంతో.. ఉత్ప‌త్తి ఖ‌ర్చు అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి కార‌ణాల‌తో ఒక‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా 30 వేల వ‌ర‌కు ఉండే డెయిరీ ఫాంల సంఖ్య ఇప్పుడు 10 వేల‌కు ప‌డిపోయింది. దీంతో పాల వ్యాపారం మాత్ర‌మే చేస్తే మొత్తం డెయిరీలే మూత ప‌డ‌తాయ‌ని గుర్తించి కొంత మంది ఔత్సాహికులు ప్ర‌త్యామ్నాయంగా ఈ గో కౌగిలింత‌ల థెర‌పీని మొద‌లు పెట్టారు.


మొద‌ట త‌మ‌కు బాగా అల‌వాటైన గోవుల‌ను ప్రేమ‌గా నిమ‌ర‌డం అదీ చేసి.. వాటికి వినియోగదారుల‌తో ఎలా ప్ర‌వ‌ర్తించాలో కాస్త శిక్ష‌ణ ఇప్పించారు. కొద్ది రోజులు ఇబ్బంది ప‌డినా త‌ర్వాత ఆవులు కూడా వ‌చ్చిన వారితో ప్రేమ‌గా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టాయి. ఇప్పుడు ఇది క్ర‌మంగా పెరిగి.. అదే ప్ర‌ధాన వ్యాపారంగా మారిపోయింది. డెయిరీల్లో రోడుకు 14 గంట‌లు గొడ్డు చాకిరీ చేసినా లాభాలు వ‌చ్చేవి కావ‌ని.. ఇప్పుడు పాల వ్యాపారం, థెర‌పీ సెష‌న్ల‌తో కాస్త డ‌బ్బులు చూస్తున్నామ‌ని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్క‌డ థెర‌పీకి వ‌చ్చిన వారికి సుమారు 45 నిమిషాల పాటు ఒక ఆవును ఇస్తారు .. వారు దానిని నిమురుతూ, గ‌డ్డి తినిపిస్తూ సంతోష‌ప‌డ‌తారు.


యానిమ‌ల్ థెర‌పీగా పిలిచే ఈ విధానంపై శాస్త్రవేత్త‌లు ఇప్ప‌టికే ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ముఖ్యంగా పెంపుడు పిల్లులు, కుక్క‌ల‌తో గ‌డప‌డంపై ఎక్కువ అధ్య‌య‌నాలు జ‌రిగాయి. ఇలా జంతువుల‌తో గ‌డ‌ప‌డం వ‌ల్ల మ‌న‌లో ఒత్తిడి కొంత‌మేర త‌గ్గుతంద‌నేది నిజ‌మేన‌ని సైక్రియాటిస్ట్ రేచ‌ల్ హార్లాండ్ వెల్ల‌డించారు. జంతువుల ప‌క్క‌నుంటే మ‌న‌లో హార్మోన్లు, ఎండార్ఫిన్లు మెరుగ్గా విడుద‌ల‌వుతాయ‌ని.. అవి మ‌న ర‌క్త‌పోటును, ఒత్తిడిని క‌లిగించే కార్టోజాల్ హార్మోన్‌ను నియంత్రిస్తాయ‌ని పేర్కొన్నారు.

Latest News