Site icon vidhaatha

Shantanu Thakur | ఐదారు నెలల్లో మమత సర్కారు పతనం

Shantanu Thakur

కోల్‌కతా: మొన్న మహారాష్ట్రలో ఎన్సీపీలో చీలిక తెచ్చి.. నిన్న బీహార్‌ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని చెప్పిన బీజేపీ నేతలు.. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌పై కన్నేశారు. మమతాబెనర్జీ ప్రభుత్వం ఐదారు నెలల్లో పడిపోతుందని ఇద్దరు సీనియర్‌ బీజేపీ ఎంపీలు వ్యాఖ్యానించారు. 294 మంది సభ్యులు ఉన్న బెంగాల్‌ అసెంబ్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు 216 మంది ఎమ్మెల్యలు ఉన్నారు.

ఇంతటి బలమైన స్థితిలో ఉన్న మమతా ప్రభుత్వాన్ని సైతం కూలగొట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘నేను గ్యారెంటీగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం ఐదారు నెలలకు మించి ఉండదు’ అని కేంద్ర నౌకాయాన, జలమార్గాల సహాయ మంత్రి శంతను ఠాకూర్‌ చెప్పారు.

ఠాకూర్‌ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బనగాం స్థానం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన ఈ మాట సెలవిచ్చిన కొద్దిసేపటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ కూడా ఇదే హెచ్చరిక చేయడం విశేషం. ఏ సమయంలోనైనా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యలు మమతా బెనర్జీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారని ఆయన జోస్యం చెప్పారు.

ఐదారు నెలల్లో ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోవచ్చు. అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఎలాగంటే.. శాసనసభ్యుల మద్దతుతో. ఏ సమయంలోనైనా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించు కునేందుకు అవకాశం ఉన్నది’ అని బలూర్‌ఘాట్‌ ఎంపీ కూడా అయిన మజుందార్‌ అన్నారు.

‘బహుశా ఒక పెద్ద ఉద్యమం రావచ్చు.. దీని ఒత్తడికి తట్టుకోలేక ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయొచ్చు. ఈ అవకాశం కూడా ఉన్నది’ అని ఆయన చెప్పారు. బెంగాల్‌ అసెంబ్లీలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. బీజేపీకి 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ 6,400 పంచాయతీలను కైవసం చేసుకుని తనకు తిరుగులేదని నిరూపించుకున్నది. ఈ ఎన్నికల్లో బీజేపీకి వెయ్యి వరకూ పంచాయతీలు దక్కినట్టు సమాచారం.

జూలై 17న తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతటి పటిష్ఠ స్థితిలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నేతలు చెప్పడమంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Exit mobile version