విధాత: నిప్పును తెలిసి పట్టుకున్నా.. తెలియక పట్టుకున్నాఎలా కాలుతుందో.. అలాగే భగవద్గీత శ్లోకాలను అర్థం చేసుకొని చదివినా.. అర్థం కాకున్నా చదివినా అజ్ఞానం తొలగి జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా పక్కన పెట్టిన ఒక ఇత్తడి పాత్రను మరల మరలా తోముతుంటే శుభ్రపడి ఎలా మెరుస్తుందో అలా గీతను కూడా ఎన్ని సార్లు చదివినా చదివిన ప్రతీసారి అజ్ఞానం పొరలు పటాపంచలై జ్ఞానం సిద్ధిస్తుంది. అంతటి మహిమాన్వితమైన భగవద్గీత ఎలా జన్మించింది? ఎందుకు ఉద్భవించింది? లాంటి సందేహాలను నేడు గీతా జయంతి సందర్భంగా నివృత్తి చేసుకుందాం.
కురుక్షేత్ర సమయంలో…
గీతా జయంతి హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత జన్మించిన రోజునే గీతా జయంతిగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసం 11వ రోజు శుక్ల ఏకాదశి తిథిలో భగవద్గీత ఆవిర్భవించింది. మహాభారత కురుక్షేత్రం జరుగుతున్నప్రాంతం. ఒక వైపు కౌరవులు.. మరో వైపు పాండవులు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో అర్జునుడు విచారణకు లోనవుతాడు. కారణం సంగ్రామంలో అందరినీ చంపడం అధర్మం అనే చింత.. అందరూ చచ్చిపోతారనే బాధ.. ఈ రెండింటి గురించి మథనపడే అర్జునుడికి శ్రీకృష్ణుడు విడమరచి చెప్పిన సారాంశమే భగవద్గీత. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను చెప్పిన రోజు గీతా జయంతి అన్నమాట.
ఒక్కో శ్లోకం.. ఒక నిధి
కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి కృష్ణుడు బోధ చేసిన ప్రదేశాన్ని ప్రస్తుతం భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర అని పిలుస్తారు. గీతా జయంతి పండుగను ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ భక్తులందరూ ఘనంగా నిర్వహిస్తారు. గీతలో 700శ్లోకాలు ఉన్నాయి. ఒక్కో శ్లోకం ఒక నిధి లాంటిది. చదివిన ప్రతిసారి జ్ఞాన రాశులు అనుభవంలోకి వస్తాయి. కొంతమంది గీతని మత గ్రంథం అని అంటుంటారు. కానీ ఎంతటి నిరాశ, నిస్ఫృహలో ఉన్న మనిషికైనా జీవన మార్గం చూపించే గ్రంథం గీత. ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలనుకునేవారు తమ ప్రయాణాన్ని గీతా అభ్యాసంతోనే ప్రారంభిస్తారు.
సంశయాల నివృత్తికి..
చాలా మంది భక్తులు ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే గీత జన్మించింది ఏకాదశి రోజున. ఈ రోజున ఉపవాసం ఉండడం పురాతన కాలం నుంచి వస్తున్న ఒక నియమం. ఏకాదశి, గీతా జయంతి ఒకే రోజు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని భక్తులు ఆధ్యాత్మిక భజనలు, పూజలు అత్యధికంగా నిర్వహిస్తారు. అలాగే పవిత్రమైన ఈ రోజున భగవద్గీత ప్రతులను ఉచితంగా పంపిణీ చేస్తుంటారు.
శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకి, సందిగ్ధతకి సమాధానంగా భగవద్గీతను వివరించారు. కానీ వేల సంవత్సరాలు గడిచినా నేటికీ ఎన్నో ప్రశ్నలకు జవాబుగా, సంశయాలను నివృత్తి చేస్తూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తుంది.
కౌరవరాజు ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కన్నులకు కట్టినట్టుగా వినిపించాడు. ఇంతటి ప్రజ్ఞ గల గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి.
చివరగా రెండు మాటలు.. మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎక్కడికి వెళ్తున్నాం.. మనం ఆశిస్తున్నదేమిటి? లభిస్తున్నదేమిటి? వంటి ఎన్నో సందేహాలకు నివృత్తి కారకం భగవద్గీత. మనిషిని సన్మార్గంలో నడిపించే సాధనం భగవద్గీత.