విధాత: ధగధగలాడాల్సిన బంగారం పెరిగిన ధరలతో భగభగ మంటోంది. పెరుగుతున్న వేసవి ఎండల ఊష్ణోగ్రతలతో పోటీ పడుతూ తగ్గెదే లేదంటూ రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో బంగారం కొనుగోలు దారులకు సెగ పుట్టిస్తుంది. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. మంగళవారం తులం బంగారంపై రూ.440 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో ఈ రోజు 24క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.9వేలు, 22క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ.8,250 వద్ధ ట్రేడ్ కొనసాగుతోంది. తులం బంగారం 24క్యారెట్లు 90వేలు, 22క్యారెట్ తులం రూ.82,500 వద్ద ధరలు కొనసాగుతున్నాయి.
శుభకార్యాల సమయం కావడంతో మార్కెట్ లో బంగారం కొనుగోలుకు డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరిగిన తీరుతో కొనుగోలు దారులు పరేషాన్ పడుతున్నారు. బంగారం కొనుగోలు భారమవుతుండటంతో అనేక మంది బంగారం కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. ఇదే సమయంలో దుబాయ్ లో 24క్యారెట్ తులం బంగారం రూ.85,596గా ఉండగా..22క్యారెట్ తులం రూ. 79,284గా ఉండటం గమనార్హం. అమెరికాలో 24క్యారెట్ తులం బంగారం రూ.83,633, 22క్యారెట్ తులం బంగారం రూ. 78,866 గా ఉంది. వెండి ధరలు సైతం పైపైకి వెలుతున్నాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.1లక్ష 13వేలుగా ఉంది.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరలు అధిక ఒడిదొడుకులను చూస్తాయని అంచనా వేస్తున్నట్లు పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం పసిడి ధరల అస్థిరతకు కారణమని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.