Tomato | నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. కిలో టమాటా ధర రూ. 200 పైనే పలికింది. ఇక ఇప్పుడిప్పుడే టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌యార్డులో టమాటా ధరలు భారీగా తగ్గాయి.
గత నెల 30 మార్కెట్ చరిత్రలోనే కిలో టమాటా అత్యధికంగా రూ. 196 పలికిన విషయం విదితమే. మొత్తంగా గత ఐదు రోజుల నుంచి మార్కెట్‌కు టమాటా దిగుబడి స్వల్పంగా పెరగడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
నిన్నటి వరకు మార్కెట్‌కు 300 టన్నుల టమాటాలు రాగా, శుక్రవారం 400 టన్నులకు పైగా టమాటాను రైతులు తీసుకొచ్చారు. దీంతో ఏ గ్రేడ్ టమాటాలు కిలో రూ. 30 నుంచి రూ. 40 వరకు, బీ గ్రేడ్ రూ. 21 నుంచి రూ. 28 వరకు పలికింది. సగటున కిలో టమాటా రూ. 26 నుంచి రూ. 37 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ కార్యదర్శి తెలిపారు.
గురువారం ఏ గ్రేడ్ కిలో టమాటా రూ. 50 నుంచి 64 వరకు, బీ గ్రేడ్ టమాటా రూ. 36 నుంచి రూ. 48 వరకు ధర పలికిన సంగతి తెలిసిందే. సగటున కిలో టమాటా రూ. 44 నుంచి రూ. 60తో వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేశారు.