Site icon vidhaatha

Viral Video | గుర్రంతో బ‌ల‌వంతంగా సిగ‌రెట్ తాగించారు..

Viral Video | త‌మ‌కు జీవ‌నాధార‌మైన జంతువుల‌ను ఎంతో ప్రేమ‌గా చూసుకుంటాం. సొంత బిడ్డ‌ల మాదిరిగానే కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం. ఏ మాత్రం హింసించం. కానీ ఓ ఇద్ద‌రు యువ‌కులు మాత్రం త‌మ జీవ‌నాధార‌మైన గుర్రాన్ని తీవ్రంగా హింసించారు. గుర్రానికి బ‌ల‌వంతంగా సిగ‌రెట్ తాగించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లో వెలుగు చూసింది.

ఉత్త‌రాఖండ్‌లో ఉన్న కేద‌ర్‌నాథ్‌కు వెళ్లే యాత్రికుల సామాగ్రిని మోసుకెళ్లేందుకు గుర్రాల‌ను, గాడిద‌ల‌ను వినియోగిస్తుంటారు. కొన్ని సంద‌ర్భాల్లో మ‌న‌షులు కూడా గుర్రాల‌పై కేద‌ర్‌నాథ్‌కు వెళ్తారు. అలా అక్క‌డున్న స్థానికులు గుర్రాలు, గాడిద‌ల ద్వారా తమ జీవ‌నోపాధిని పొందుతారు.

అయితే త‌మ‌కు జీవ‌నాధారాన్ని క‌ల్పిస్తున్న ఓ గుర్రానికి ఇద్ద‌రు యువ‌కులు బ‌ల‌వంతంగా సిగ‌రెట్ తాగించారు. ఒక యువ‌కుడేమో దాని నోరు, ముక్కుకు సంబంధించిన ఒక రంధ్రాన్ని త‌న చేతితో మూసేశాడు. మ‌రో యువ‌కుడేమో గుర్రం ముక్కులో సిగ‌రెట్ పెట్టి బ‌ల‌వంతంగా తాగించాడు. ఈ ఘ‌ట‌న‌ను కొంద‌రు వ్య‌క్తులు త‌మ ఫోన్ల‌లో చిత్రీక‌రించి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేశారు. అయితే గంజాయితో కూడిన సిగ‌రెట్‌ను గుర్రానికి తాగించిన‌ట్లు నెటిజ‌న్లు ఆరోపిస్తున్నారు. ఇలాంటి క్రూర‌మైన చ‌ర్య‌లకు పాల్ప‌డి, మూగ‌జీవాల‌ను హింసిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వీడియో రుద్ర‌ప్ర‌యాగ్ పోలీసుల దాకా చేరింది. దీంతో వారు కేసు న‌మోదు చేశారు. కేదార్‌నాథ్‌కు 16 కిలోమీట‌ర్ల దూరంలో.. చోటీ లించోలి స‌మీపంలోని థారు క్యాంప్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఆ గుర్రం య‌జ‌మాని రాకేశ్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సిగరెట్‌లో గంజాయి ఉందా? అన్నదానిపై దర్యాప్తు చేస్తామ‌ని పోలీసులు తెలిపారు. కాగా, ఏప్రిల్‌ 25న కేథార్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటి వరకు గుర్రాల పట్ల క్రూర ప్రవర్తనకు సంబంధించి 14 కేసులు నమోదయ్యాయి.

Exit mobile version