Kushi Movie Review | ‘ఖుషీ’ సినిమా రివ్యూ.. హయిగా ఊపిరి పీల్చుకోవచ్చు

Kushi Movie Review | మూవీ పేరు: ‘ఖుషి’ విడుదల తేదీ: 01 సెప్టెంబర్, 2023 నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, మురళీ శర్మ, సచిన్ ఖేడ్‌కర్, వెన్నెల కిశోర్, రోహిణి, శరణ్య, జయరామ్ తదితరులు సినిమాటోగ్రఫీ: మురళి. జి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి సంగీతం: హేషమ్ అబ్ధుల్ వాహబ్ నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ రచన, దర్శకత్వం: శివ నిర్వాణ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఎలా […]

  • Publish Date - September 2, 2023 / 06:34 AM IST

Kushi Movie Review |

మూవీ పేరు: ‘ఖుషి’
విడుదల తేదీ: 01 సెప్టెంబర్, 2023
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, మురళీ శర్మ, సచిన్ ఖేడ్‌కర్, వెన్నెల కిశోర్, రోహిణి, శరణ్య, జయరామ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మురళి. జి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సంగీతం: హేషమ్ అబ్ధుల్ వాహబ్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ

‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఎలా మారిపోయిందో తెలియంది కాదు. ఒక్కసారిగా టైర్ 1 హీరోల జాబితాలోకి వచ్చేసిన విజయ్.. పాన్ ఇండియా హీరోగా ‘లైగర్’తో కదంతొక్కాలని చూశాడు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా పరాజయం పాలవడంతో.. కొన్నాళ్లుగా సైలెంట్‌గానే ఉన్నాడు విజయ్. ‘లైగర్’ రిజల్ట్‌తో అంతకు ముందు అనుకున్న రెండు మూడు ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయి. దీంతో విజయ్ దేవరకొండ కెరియర్ కష్టాల్లో పడింది.

అయితేనేం.. తన యాటిట్యూడ్‌తో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటున్న విజయ్‌కు.. ‘ఖుషి’ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఈ సినిమా రిజల్ట్ అతని కెరియర్‌కి ఎంతో కీలకం. మరోవైపు సమంత పరిస్థితి కూడా సేమ్ టు సేమ్. ‘శాకుంతలం’తో పోయిన పరువు నిలబెట్టుకోవాలి. ఆమె సినిమాలు చేసినా, చేయకపోయినా.. ఒక హిట్ సినిమాతో కెరియర్ ఆపేస్తే బెటర్ అని ఆమె అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు. ప్రస్తుతం సినిమాలకు ఆమె కొన్నాళ్ల పాటు ఫుల్‌స్టాప్ పెడుతున్నానని అధికారికంగా ప్రకటించడంతో.. సమంత‌కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని అంతా వేచి చూస్తున్నారు.

దర్శకుడు శివ నిర్వాణ విషయానికి వస్తే.. ఆయన కూడా ఓ కమర్షియల్ సినిమాలు చేసేసి పెద్ద దర్శకుడిని అయిపోవాలనే ప్రయత్నాలు చేసే డైరెక్టర్ అయితే కాదు. ఓ మంచి ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సినిమాలు చేయడంలో శివ నిర్వాణ దిట్ట. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలు అలాంటి కోవకి చెందినవే. మధ్యలో ‘టక్ జగదీష్’ అని చేసిన ప్రయత్నం ఓటీటీకే పరిమితమైంది.

ఇప్పుడీ ముగ్గురి కలయికలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన టైటిల్‌తో.. టాలీవుడ్‌లో అగ్రగామి సంస్థగా దూసుకెళుతోన్న మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో రకంగా వార్తలలో ఉంటూనే ఉంది. ముఖ్యంగా పాటలు ఈ సినిమాని నిత్యం వార్తలలో ఉంచుతున్నాయి. మధ్యలో వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ వేడుకలో సమంత, విజయ్‌లు చేసిన సాహసాలు, రొమాన్స్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఈ సినిమా కథగా చెప్పాలంటే.. తెలుగు సినిమా తెరకి తెలియని కథ కాదు.. తెలుగు ప్రేక్షకులు చూడనిది అంతకంటే కాదు. నాని ‘అంటే సుందరానికీ’, నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారీ’ల కథకి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రెండు సినిమాల కథకి దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘సఖి’, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాల కథని లింక్ చేస్తే వచ్చే కథే ‘ఖుషి’. దేవుడంటే నమ్మకంలేని విప్లవాత్మక భావాలు కలిగిన ఫ్యామిలీకి చెందిన విప్లవ్ (విజయ్ దేవరకొండ).. గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనే కసితో.. బిఎస్‌ఎన్ఎల్‌లో జాబ్ సంపాదిస్తాడు. కశ్మీర్‌లో పోస్ట్ వేయించుకున్న అతనికి అక్కడ ఆరా బేగం (సమంత) కనిపిస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడటమే కాకుండా.. తనే తన లైఫ్ పార్టనర్‌ అని ఫిక్సవుతాడు. ఇలా కొన్ని సంఘటనల తర్వాత ఇద్దరూ ప్రేమలో మునిగిపోతారు.

కట్ చేస్తే.. తను బేగం కాదని బ్రాహ్మిణ్ అని తెలిసిన తర్వాత.. అసలు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రవచనాలు చెప్పుకుని, దేవుడిని అమితంగా నమ్మే ఆరాధ్య (సమంత) తండ్రి (మురళీ శర్మ).. వారి ప్రేమను అంగీకరించడు. నాస్తిక ఫ్యామిలీ‌కి తన కుమార్తెను ఇవ్వడం ఇష్టపడని ఆయన.. ఒకవేళ వారు కలిసి ఉన్నా.. కలకాలం సుఖంగా జీవించలేరని భావిస్తాడు. అయినా సరే.. ప్రేమ జంట ఫ్యామీలీని కాదని.. పెళ్లి చేసుకుని ఉత్తమ జంటగా నిలవాలని భావిస్తోంది. అలా తలిచి పెళ్లి చేసుకున్న ఆ జంట మధ్య ఏం జరిగింది? వాళ్లు ఆశించింది జరిగిందా? వారి కథ చివరికి ఎలా సుఖాంతమైంది? అనేది తెలుసుకోవాలంటే ఎంటర్‌టైన్‌మెంట్‌గానూ అలాగే ఎమోషనల్‌గానూ సాగిన ఈ సినిమాని చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

విజయ్ దేవరకొండలోని యాటిట్యూడ్‌‌ని చూపిస్తూనే.. తనలోని నటుడిని దర్శకుడు బయటికి తీశాడు. ‘గీత గోవిందం’ తరహాలోనే విజయ్ పాత్ర నడుస్తున్నట్లుగా ఉంటుంది. విజయ్ దేవరకొండ మధ్య మధ్యలో తనదైన తరహా నటన కొనసాగిస్తూనే.. దర్శకుడు చెప్పింది చేసుకుపోయినట్లుగా సినిమా చూస్తే తెలుస్తుంది. మరోసారి మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అతడి నుంచి ప్రేక్షకులు చూడవచ్చు. విజయ్ దేవరకొండ, ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక కొన్నాళ్ల పాటు విజయ్‌కి తిరుగుండదు.

సమంత విషయానికి వస్తే కాస్త తన రియల్ లైఫ్‌గా దగ్గరగా ఉన్న కథ కూడా సెట్ అవడంతో.. సమంత ఈజీగా చేసేసింది. ముఖ్యంగా విజయ్‌తో ఆమె కెమిస్ట్రీ చక్కగా పండింది. ఇద్దరూ కలిసి ప్రేక్షకులని సహజమైన ప్రపంచంలోకి తీసుకెళతారు. మరీ ముఖ్యంగా యూత్ సమంత‌కు బాగా కనెక్ట్ అవుతారు. ఒక పాటలో సమంత, విజయ్‌ల మధ్య కెమిస్ట్రీ చూడచక్కగా ఉంది. హీరో, హీరోయిన్ల తండ్రులుగా చేసిన సచిన్ ఖేడ్‌కర్, మురళీ శర్మలకు మంచి పాత్రలు పడ్డాయి.

వారిద్దరూ కూడా నటనలో తమ ప్రతిభను కనబరిచారు. అలాగే.. శరణ్య, రోహిణిలకు కూడా రెండు మంచి సీన్లు పడ్డాయి. ఇంకా సమంత పక్కన ఉండే అమ్మాయికి కూడా మంచి పాత్ర లభించింది. ఇంకా ఇతర పాత్రలలో చేసిన జయరామ్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. ఫస్టాప్‌లో అలీ, సెకండాఫ్‌లో బ్రహ్మానందం గెస్ట్ అప్పీరియెన్స్ ఇస్తారు. మిగతా పాత్రలలో నటించిన వారంతా ఓకే.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మొదటి నుంచి వినిపిస్తున్నట్లుగా ఈ సినిమాకు హేషమ్ అబ్ధుల్ వాహబ్ సంగీతం, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన హైలెట్స్ అని చెప్పుకోవాలి. పాటలు చిత్రీకరించిన తీరు కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే సినిమాటోగ్రఫీ కన్నులకు ఇంపుగా ఉంది. కశ్మీర్ అందాలను ఒడిసి పట్టిన తీరు, ఫ్యామిలీల మధ్య ఎమోషన్స్‌కి కనెక్ట్ చేసిన తీరు హైలెట్ అని చెప్పుకోవాలి.

ఎడిటింగ్ పరంగా మాత్రం.. ఈ సినిమాని ఇంకో 15 నుంచి, 20 నిమిషాల వరకు ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇద్దరు అందమైన జంట, వారి మధ్య ప్రేమ సన్నివేశాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని భావించినట్లు న్నాడు దర్శకుడు.. బాగా సాగదీశాడని అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెర పడి ఉంటే.. ఇంకాస్త క్రిస్ప్‌గా సినిమా ఉండేది. డైలాగ్స్ బాగున్నాయి.

నిర్మాణం పరంగా మైత్రీ వారు తమ బ్యానర్ వేల్యూని ప్రదర్శించారు. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా ఉంటుంది. ఇక దర్శకుడు శివ నిర్వాణ విషయానికి వస్తే.. ఆయన కొత్తగా చెప్పిన కథేం లేదు ఇందులో. కానీ స్ర్కీన్‌ప్లే, ఆర్టిస్ట్‌లు, ఎమోషన్స్‌ని బేస్ చేసుకుని.. మ్యూజిక్ టచ్‌తో ప్రేక్షకులను రంజింప చేయాలనే ప్రయత్నం చేశాడు. చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవాలి.

విశ్లేషణ:

మొదట చెప్పుకున్నట్లుగా ఇది తెలుగు ప్రేక్షకులకు తెలియని స్టోరీ కాదు. ఆల్రెడీ ప్రేక్షకులకు తెలిసిన స్టోరీని మళ్లీ చెబుతున్నప్పుడు.. అందులో ఏదైనా కొత్తగా చూపించాలి. ఒక ఫ్యామిలీ నాస్తిక ఫ్యామిలీ, మరో ఫ్యామిలీ ఆస్తిక ఫ్యామిలీ. ఇది మెయిన్ పాయింట్‌గా తీసుకున్న శివ నిర్వాణ.. ఆ ఫ్యామిలీలో విజయ్, సమంతలను ఉంచి.. వారి మధ్య ప్రేమకథను సృష్టించిన తీరు వరకు కొత్తగానే ఉంటుంది.

కశ్మీర్ నేపథ్యంలో నడిచిన ఈ ప్రేమ కథ, పాటలు, మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు.. ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తాయి. ఇక ఈ ప్రేమకథ ఫ్యామిలీలకు చేరినప్పటి నుంచి.. అంతా తెలిసినట్లే అనిపిస్తుంది. రొటీన్‌గానే కథ సాగుతుంటుంది. పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఇద్దరి మధ్య పెద్దలు ఊహించినట్లుగానే అపార్థాలు రావడం వంటివి.. అన్నీ మనకు తెలిసినట్లే జరుగుతుంటాయి. కానీ ఏదో ఫీల్ మాత్రం సినిమా వైపు ఆకర్షిస్తుంటుంది. అదే విజయ్, సమంతల కెమిస్ట్రీ.

ఈ సినిమాకు వీరిద్దరు కాకుండా వేరే వారయితే నిజంగానే ఈ సినిమాలో ఇంత ఫీల్ వచ్చేది కాదేమో. ఇద్దరు వేరు వేరు మతాలకు చెందిన వారు పెళ్లి చేసుకుని, వారి మధ్య అపార్థాలు వచ్చినప్పుడు.. ఇరు ఫ్యామిలీల మధ్య ఉండే ఎత్తిపొడుపులు కూడా శివ నిర్వాణ ఇందులో చక్కగా చూపించాడు కానీ.. వాటినే సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అయితే ఎంత తెలిసిన కథ అని అనిపించినా.. చివరికి సినిమాని ముగించిన తీరుతో ప్రేక్షకులు చాలా వరకు శాటిస్‌పై అవుతారు.

సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు కొత్తగా జోడించానని దర్శకుడు తలచినా.. ఆ ఫెర్టిలిటీ సెంటర్ సీన్లు, కేరళలో చిత్రీకరించిన కొన్ని సీన్లు, హీరోకి టెస్ట్‌లంటూ వచ్చే కొన్ని సీన్లు.. కాస్త చిరాకును తెప్పిస్తాయి. అలాగే దర్శకుడు కమర్షియల్ యాంగిల్‌లో ఆలోచించి రెండు ఫైట్స్ కూడా పెట్టాడు. అవసలు సినిమాకి అవసరం కూడా లేదు. మొత్తంగా అయితే ఈ సినిమాకు విజయ్, సమంతల కెమిస్ట్రీ, వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలే బలం అని చెప్పుకోవాలి. మిగతా అంతా.. ఆల్రెడీ చూసిన ఫీలింగే ఉంటుంది. ‘ఖుషి’ అనే టైటిల్‌కి దర్శకుడు క్లైమాక్స్‌తో జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు బాగుంటుంది.

ట్యాగ్‌లైన్: ఖుషీగా ఊపిరి పీల్చుకోవచ్చు
రేటింగ్: 2.75/5

Latest News