Virupaksha
ఈ మధ్య జర్నలిస్ట్‌ల ముసుగులో ఉన్న కొందరు.. ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలు మీడియా పరువు తీసేస్తున్నాయంటే.. ఏ రేంజ్‌లో జర్నలిస్ట్‌లని చెప్పుకుంటున్న కొందరు దిగజారి పోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ఇద్దరు ముగ్గురు జర్నలిస్ట్‌లు ఇంటర్వ్యూలలో అడిగే ప్రశ్నలు.. మీడియాని చులకన చేసేలా ఉండటం విశేషం.
ఒకసారి చెప్పినా కూడా వారు మారకుండా పదేపదే అలాంటి ప్రశ్నలే అడుగుతూ.. మేము ఏదో గొప్ప ప్రశ్న వేశామనేలా ప్రౌడ్‌గా ఫీలవుతున్నారు. ఇంతకు ముందు డిజె టిల్లు ఇంటర్వ్యూలో హీరోయిన్‌ని.. నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో.. హీరోకి తెలుసా? అని అడిగిన జర్నలిస్టే.. ఇప్పుడు ‘విరూపాక్ష’ ఇంటర్వ్యూలోనూ అలాంటి తలతిక్క ప్రశ్నే యూనిట్‌కు సంధించాడు.
ఇక్కడ జర్నలిస్ట్ పేరు అప్రస్తుతం కాబట్టి.. పేరు వెల్లడించటం లేదు. అయితే ఆ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సాయిధరమ్ తేజ్ గూబ గుయ్‌మనేలా ఆన్సరిచ్చాడు. ఇంతకీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ఈ సినిమాకి A సర్టిఫికేట్ ఇచ్చారు.. అంటే మీకు, సంయుక్తా మీనన్‌కు మధ్య రొమాన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయానా? లేకపోతే హర్రర్ సన్నివేశాలు కారణమా? అని అడిగాడు.
ఈ ప్రశ్నకు సాయిధరమ్ తేజ్ సమాధానమిస్తూ.. ‘రొమాంటిక్ సన్నివేశాలు ఉంటేనే టికెట్స్ తెగుతాయా?’.. అలా అయితే మీరనుకున్న సన్నివేశాలు ఉండే చిత్రమైతే ఇది కాదు. మీకు బాగా గ్యాప్ వచ్చినట్లుంది. ఇంత గ్యాప్ వస్తే కష్టం కదా.. అందులోనూ మీ చుట్టూ అబ్బాయిలే కూర్చుని ఉన్నారు. మీరు ఆశించే లాంటివి ఏవీ ఇందులో లేవు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇదని చెప్పుకొచ్చాడు.
#Virupaksha will definitely excite you but the movie did not get an ‘A’ certificate for sexual references. – Sai Dharam Tej’s explanation to a journalist who asked if the film got an ‘A’ certificate due to romantic/sexual sequences between the lead pair. pic.twitter.com/969M8Y0Kxr
— Aakashavaani (@TheAakashavaani) April 20, 2023
ఇదే విషయంపై దర్శకుడు కలగజేసుకుని.. ఇందులో గూజ్‌బంప్స్ వచ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి. అందుకే సెన్సార్ వారు ఏ సర్టిఫికేట్ ఇచ్చారని మరింత క్లారిటీ ఇచ్చారు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ కలగజేసుకుని.. ‘మగధీర’ చిత్రానికి కూడా ఏ సర్టిపికేట్‌నే ఇచ్చారు. అందులో రొమాన్స్ సన్నివేశాలే ఉన్నాయా? జనాలందరూ చూసే కంటెంట్ ఇందులో ఉంటుంది అని వివరణ ఇచ్చారు.
దీంతో ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ ముఖం చిన్నబోయింది. అయినా సరే.. మళ్లీ ఇలాంటి ఈవెంట్ ఏదైనా జరిగితే.. ఆ జర్నలిస్ట్ తీరు మారదు. ఆయన ఏం ప్రశ్న అడిగారో.. దానికి వాళ్లు ఏం సమాధానం ఇచ్చారో కూడా తెలియని గొప్ప జర్నలిస్ట్‌ని మీడియా భరిస్తోంది మరి. అన్నట్టు ఈ జర్నలిస్టే ఓ మీడియా సంస్థని నడుపుతుండటం గమనార్హం.