- మళ్లీ అనుమతి ఇవ్వకపోవడంలో మతలబేంటి?
- ప్రభుత్వ ఒత్తిడి కారణమంటున్న విద్యార్థి జేఏసీ
- వీసీ తీరుపై విద్యార్థి నాయకుల ఆగ్రహం
- హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాకతీయ యూనివర్సిటీలో బుధవారం తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘర్షణ సభకు కేయు వైస్ ఛాన్స్‌లర్ తాటికొండ రమేష్ అనుమతి ఇవ్వకపోవడం పట్ల విద్యార్థి జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి ఎలాగైనా సభ నిర్వహించాలని పట్టుదలతో జేఏసీ నాయకులు ఉన్నారు.
25న సభ నిర్వహణకు అనుమతి
ఈనెల 25వ తేదీన సంఘర్షణ సభను కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం గ్రౌండ్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించేందుకు వీసి ముందుగా అనుమతించారు. ఈ సభ అనుమతి కోరుతూ ఫిబ్రవరి 28వ తేదీన కేయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విసీకి విన్నవించారు. ఈ విన్నపములో పదివేల మందితో సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు దీనిపై స్పందించిన విసి ఈనెల రెండవ తేదీన 25వ తేదీ సభకు అనుమతిని ఇచ్చారు.
వాయిదా పడడంతో అనుమతి రద్దు
ఈనెల 25న నిర్వహించాలని భావించిన సంఘర్షణ సభ అనివార్య కారణాలవల్ల విద్యార్థి జేఏసీ నాయకులు వాయిదా వేసుకున్నారు. సభను తిరిగి 29వ తేదీ బుధవారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులకు తెలియజేశారు. అయితే ఆఖరి వరకు సభ నిర్వహించుకునేందుకు అనుమతిస్తామంటూ నమ్మించి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. దీంతో బుధవారం చేపట్టిన సభ స్థానంలో విద్యార్థులు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అనంతరం ర్యాలీ నిర్వహించి వీసీ తీరుకు నిరసనగా ఆఫీస్ ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వ ఒత్తిడి కారణం
ముందుగా సభకు అనుమతి ఇచ్చి వాయిదా పడిన కారణంగా తదుపరి అనుమతి ఇవ్వకుండా వీసి వ్యవహరించడం వెనుక ప్రభుత్వం అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉన్నదని విద్యార్థి జేఏసీ నాయకులు విమర్శిస్తున్నారు. తాము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడి అనేక కేసులు, జైలు శిక్షలు అనుభవిస్తే ఇవాళ మా గోడు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. కేయూ క్యాంపస్‌లో సభ జరిపి తీరుతామంటూ జాక్ నాయకులు ప్రకటించారు.