Site icon vidhaatha

Warangal | వరంగల్ నగరం.. ఈ దుస్థితికి కారణమెవరు?

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పేరుకు పెద్దదిగా ఉన్న వరంగల్ నగరంలో భారీ వర్షం కురిస్తే వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులుగా మారి, లక్షలాదిమంది వరద నీట మునుగుతున్న దుస్థితికి కారణమెవరు? ఏటా ఈ పరిస్థితి ఉత్పన్నమైనా ఎందుకు చర్యలు చేపట్టడం లేదని, నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగర పాలకవర్గం విఫలం, ప్రభుత్వ నిర్లక్ష్యం తోడై ప్రతి సంవత్సరం వేలాదిమంది ప్రజలు వరద నీటిలో, బురదతో జీవనం సాగిస్తున్నారు.

కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి అభివృద్ధి చేస్తున్నామంటు చెబుతున్నప్పటికీ, అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ వల్ల నగర ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు. దాదాపు పది లక్షల మంది నివసించే నగర ప్రజల పట్ల కనీస ప్రణాళిక లేకపోవడంతో వరద నీరు, మురికి నీరు కలగలిసి పరిస్థితి దయనీయంగా మారింది.

పాలకవర్గాల నిర్లక్ష్యం

రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా ఉన్నప్పటికీ, వరంగల్ పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, మునిసిపల్ కార్పొరేషన్ వైఫల్యం కలగలిసి ఇక్కడి ప్రజలకు శాపంగా మారాయి. హనుమకొండ, వరంగల్ కాజీపేట ప్రాంతాలతో ట్రైసిటీగా పేరొందిన వరంగల్లో వందలాది కాలనీలున్నాయి.

వీటికి అదనంగా రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న నూతన కాలనీలతో నగరం మహానగరంగా విస్తరించింది. దీనికి తగిన విధంగా వర్షం నీరు, మురికి నీరు వెళ్లేందుకు ప్రణాళికలు లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రెండు దశాబ్దాలుగా నగర ప్రణాళిక కోల్డ్ స్టోరేజ్ లో మూలుగుతుంది.

నగరానికి పెరుగుతున్న వలసలు

గ్రామీణ ప్రాంతాల నుంచి సాగుతున్న వలసలు, విద్య, ఉపాధి, వైద్య వసతుల కారణంగా రోజురోజుకు వరంగల్ నగర జనాభా పరిధి విస్తరిస్తోంది. దీనికి తోడు మహానగరపాలక సంస్థగా మార్చే క్రమంలో చుట్టూ ఉన్న 34 గ్రామాలను వరంగల్ నగరంలో విలీనం చేశారు. దీంతో పరిధి మరింత పెరిగింది.

ప్రాథమిక వసతుల కల్పనలో వైఫల్యం

నగర పరిధికి తగిన స్థాయిలో వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది.
వరంగల్ నగరంలో దాదాపు 120 పైగా మురికివాడలు, గుడిసె వాసుల కాలనీలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. చెరువు కుంటలు ప్రాంతాల్లో భూ అక్రమణల ద్వారా పేదల గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు.

ఇక భూ ఆక్రమణదారులు విచ్చలవిడిగా చెరువు, కుంటలను ఆక్రమించుకొని ఇళ్ల స్థలాలుగా విక్రయించడం కూడా నగర ప్రజలకు శాపంగా మారింది. దీంతో విస్తృత స్థాయిలో ఉన్న వరంగల్ నగరంలో కురిసే వాన నీరు పోయేందుకు వీలైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పోయింది. గతంలో వర్షం కురిస్తే కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు జలాశయాల్లో నీరు నిలిచి మత్తడి పోసి నగర శివారు ప్రాంతాలకు చేరేది.

మూడు దశాబ్ధాలుగా దయనీయం

గత మూడు దశాబ్ధాల కాలంలో నగరంలోని గొలుసు కట్టు చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగయ్యాయి. పలుకుబడి ఉన్న నాయకులు, అధికారులు అంతర్గతంగా మిలాఖతై యధేచ్ఛగా వీటిని ఆక్రమించుకున్నారు. వీటికి తోడు ప్రధాన నాలాలు ఆక్రమణకు గురికావడంతో వర్షం నీరు, డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేందుకు సమస్యలు నెలకొంటున్నాయి. వీటికి అదనంగా ఓపెన్ నాలాల్లో సరైన సమయంలో పూడిక తీయకపోవడం ఫలితంగా నాలాలు రోజురోజుకు పూడిపోతున్నాయి.

ఇదిలా ఉండగా భద్రకాళి, వడ్డేపల్లి, చిన్న వడ్డేపల్లి తదితర ప్రధాన జలాశయాల పరిసర ప్రాంతాల్లో బఫర్ జోన్ నిబంధన, ఎఫ్టిఎల్ నిబంధన పాటించకుండా చేపట్టిన నిర్మాణాల ఫలితంగా సమస్యలు మరింత పెరిగాయి. ఈ తెర వెనుక బాగోతానికి రాజకీయ పార్టీల నేతలతో పాటు ఉన్నత స్థాయి అధికారుల తోడ్పాటు, అక్రమ ఆదాయం ప్రధానంగా ఉంది. దీంతో విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్నాయి.

అస్తవ్యస్తమైన డ్రైనేజీలు

వరంగల్ శివనగర్, పెరిక వాడ, సాకరాశి కుంట, కాశి కుంట, మినీ బ్రిడ్జి, బొందివాగు, పోతన నగర్, ఎల్బీనగర్, తుమ్మలకుంట, కాశీబుగ్గ, రంగంపేట, ములుగు రోడ్డు, నయీం నగర్, పెద్దమ్మ గడ్డ, గోపాల్పూర్, కిషన్ పుర, ఏనుగులగడ్డ, కాజీపేట, ప్రశాంతినగర్, వడ్డేపల్లి, ఆర్టీసీ కాలనీ, బోడగుట్ట, బొక్కలగడ్డ, హసన్పర్తి, పలివేలుపుల తదితర ప్రాంతాలలోని ప్రధాన నాలాలు వర్షాకాలం వచ్చిందంటే పొంగిపొర్లుతున్నాయి. దీంతో నీరు సాఫీగా వెళ్లేందుకు మార్గం లేక లోతట్టు ప్రాంతాలు కాలనీలలోకి నీరు చేరి ఇళ్లను ముంచెత్తుతున్నాయి.

ప్రణాళిక రూపొందించడంలో వైఫల్యం

ఏటా ముంపు సమస్య ఉత్పన్నమవుతున్నా వరంగల్ కార్పొరేషన్ ముందస్తు ప్రణాళిక రూపొందించడంలోగాని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడంలోగాని విఫలమవుతుంది. దీనికి తోడు కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల జాప్యంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి.

అధికార, ప్రజాప్రతినిధుల హడావుడి

వరంగల్ సిటీ ముంపుసమస్య ఉత్పన్నమైన సందర్భంలో ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేసి ఆ తర్వాత మరిచిపోతున్నారు. గత మూడేళ్ల క్రితం కూడా ఈ సమస్య ఉత్పన్నమైంది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హెలికాప్టర్లో నగర జలదిగ్బంధనాన్ని పరిశీలించారు. మంత్రి ఆడంబర ప్రకటనలు ఇచ్చినప్పటికీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. దీనికి ముందు ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంలో ఏటా రూ. 300 కోట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ, ఆచరణలో అమలు కావడం లేదు.

ఇక వరంగల్ సిటీ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, మేయర్‌ వేలకోట్ల రూపాయల అభివృద్ధి చేస్తున్నామని చెప్పినప్పటికీ, ఏటా ఈ ముంపుబారి నుంచి ప్రజలను రక్షించలేకపోతున్నారు. వరద నీరు వచ్చిన సందర్భంలో మాత్రం సహాయ చర్యల పేరుతో ఆర్భాటం చేస్తున్నారు. పునరావాస కార్యక్రమాలు, భోజన వసతులు, శిబిరాలంటూ రాజకీయ ప్రచార కార్యక్రమంగా మార్చి వేశారు.

ఎన్నికల ఏడాది కావడంతో ఈ దఫా అధికార పార్టీకి చెందిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్‌, నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి బాధితులను పరామర్శించడంలో నిమగ్నమయ్యారు.

విపక్షాల వైఫల్యం

వరంగల్ నగర పరిధిలోని విపక్షాలు అధికార పార్టీని నిలదీయడంలో చూపెడుతున్న అలసత్వం కూడా వరదల సమస్యకు ఒక కారణంగా చెప్పవచ్చు. బీజేపీ నాయకులు కుసుమ సతీష్, ప్రదీప్ రావు గంటా రవికుమార్, రావు పద్మ , ధర్మారావు, రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నాయని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, కొండా మురళీధర్ రావు తదితరులు వరద ప్రాంతాలలో పర్యటించి వారికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు.

ఎన్నికల సంవత్సరం కావడంతో బీజేపీ నేత, ఎన్నికల ప్రచార చైర్మన్ ఈటల రాజేందర్ వరంగల్ నగరంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటన కూడా వరంగల్లో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు.

రాజకీయ విమర్శలు, పరస్పరం బురద జల్లుకోవడం తప్ప నగర ప్రజలను వరద ముప్పు నుంచి కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపెట్టడంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రతి ఏటా తలెత్తే ఈ వరద ముప్పు నుంచి వరంగల్ నగర ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నారు.

Exit mobile version