BRSతో పొత్తు ఉన్నా, లేకున్నా మిర్యాలగూడలో పోటీ చేస్తాం: తమ్మినేని వీరభద్రం

విధాత: మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో సీపీఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని, ఎర్రజెండా గెలుపు కోసం ప్రజలంతా సహకరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సీపీఎం పార్టీ మిర్యాలగూడ జన చైతన్య యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో పొత్తు ఉన్నా లేకున్నా సీపీఎం మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నప్పటికి ప్రజలను బాధ పెట్టే సమస్యలపై ప్రభుత్వంపై ఉద్యమిస్తామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి […]

  • Publish Date - March 27, 2023 / 02:45 AM IST

విధాత: మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో సీపీఎం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని, ఎర్రజెండా గెలుపు కోసం ప్రజలంతా సహకరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. సీపీఎం పార్టీ మిర్యాలగూడ జన చైతన్య యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో పొత్తు ఉన్నా లేకున్నా సీపీఎం మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నప్పటికి ప్రజలను బాధ పెట్టే సమస్యలపై ప్రభుత్వంపై ఉద్యమిస్తామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి బాధ్యులైన వారందరినీ సమగ్ర విచారణ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని తమ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.

కాగా మూడు రోజుల క్రితం పాలేరు జనచైతన్య సభలో తమ్మినేని మాట్లాడుతూ సిపిఎం పార్టీ పాలేరు నుండి పోటీ చేయనుందని స్థానిక బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ముందే స్వయంగా కుండ బద్దలు కొట్టారు. పొత్తు ధర్మంలో కందాలకు సీటు వస్తే ఆయనను తాము నెత్తిన పెట్టుకొని గెలిపిస్తామని, అదే పద్ధతిలో తమ పార్టీకి సీటు కేటాయిస్తే ఆయన కూడా పని చేయాలని, చేస్తామని చెప్పారని తమ్మినేని ప్రకటించారు.

తమ్మినేని మాటలను అదే వేదికపై ఉన్న కందాల అప్పుడే ఖండించక పోయినా మరుసటి రోజు మాత్రం కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని పాలేరు సీటు నాదే.. టికెట్ నాదే.. గెలుపు నాదేనని తేల్చి పారేశారు. దీంతో బిఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలకు మధ్య పొత్తు వ్యవహారం ఎన్నికలకు ముందే వివాదాస్పదమైంది.

ఇది ఇలా ఉండగానే తమ్మినేని మరో అడుగు ముందుకేసి ఆదివారం మిర్యాలగూడ జన చైతన్య సభలో తమ పార్టీ బీఆర్ఎస్‌తో పొత్తు ఉన్నా లేకున్నా మిర్యాలగూడలో పోటీ చేస్తుందని ప్రకటించి ఇక్కడ సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావును ఇరకాటంలోకి నెట్టేశారు. తమ్మినేని మాటలపై ఇక భాస్కరరావు స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

సీపీఎం పార్టీ పక్కా వ్యూహంతో జనచైతన్య యాత్రలను తాము పోటీ చేయదలుచుకున్న పాలేరు, మిర్యాల గూడలో వరుసగా కొనసాగించి ఆ రెండు సీట్లలో పోటీ చేయబోతున్నట్లుగా ప్రజల మధ్య ప్రకటించి పొత్తుల బంతిని.. సీట్ల లెక్క పంచాయితీని బిఆర్ఎస్ కోర్టులోకి నెట్టివేయగా.. పొత్తుల వివాదంలో మునుముందు ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయోనని ఆయా పార్టీల కేడర్ ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

Latest News