- 42 కోట్ల నిధులతో పాత్రికేయుల సంక్షేమానికి కృషి
- ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జర్నలిస్టుల సంక్షేమం, నైపుణ్య అభివృద్దే లక్ష్యంగా ప్రెస్ అకాడమీ పనిచేస్తుందని రాష్ట్ర అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శనివారం భూపాలపల్లి జిల్లాలోని పాత్రికేయులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ జక్కుల శ్రీహర్షినితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజల శ్రేయస్సు కోసం నిస్వార్ధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది పాత్రికేయులు జీతాలు లేకుండా పనిచేస్తున్నారని, వారి నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులు నిర్వహిస్తుందన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం 42 కోట్ల నిధులు కేటాయించిందని, ఇప్పటివరకు 500 పైగా మరణించిన కుటుంబాలకు, కరోన సమయంలో 4వేల మందికి ఆర్థిక సహాయం చేశామని ఆయన తెలిపారు. జర్నలిస్టులు నైతికతతో ఉండాలని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని ఆయన సూచించారు. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా పార్టీల నేతలు చెప్పే ప్రతి వాక్యాన్ని అలాగే రాయడం పట్ల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న విషయాన్ని ఈ శిక్షణ ద్వారా తెలియజేయాలని ఆయన సూచించారు. జిల్లా మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాల కోసం పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ జక్కుల శ్రీహర్షిని, ప్రెస్ అకాడమీ ఓ.ఎస్డీ రహేమాన్, మేనేజర్ వెంకటేశం, జర్నలిస్టు నాయకులు మారుతి సాగర్, విష్ణువర్ధన్ రెడ్డి, బి.ఆర్.లెనిన్, వెంకన్న, రాజనారాయణ, వి.వెంకటరమణ, వంశీ క్రిష్ణ, శ్యామ్, చిల్ల మల్లేశం, బుచ్చన్న మున్సిపాల్ చైర్మన్ సెగ్గం వెంకట రాణి సిద్దూ, జిల్లా మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.